Monday, November 18, 2024

AP – పిచ్చిగా మాట్లాడితే తాట తీస్తా – వైసిపి నేత‌ల‌కు ప‌వ‌న్ కల్యాణ్ వార్నింగ్

ద్వారకా తిరుమ‌ల – గత ప్రభుత్వం వైసీపీ చేసిన తప్పుడు విధానాల వల్ల వ్యవస్థ పాడయిందని, ఆ పార్టీ ఎన్నిక‌ల‌లో ఓడి 11 సీట్లు మిగిలిన వాళ్ళ నోళ్లు మూతపడటం లేద‌న్నారు ఎపి ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో ఆయ‌న దీపం పథకాన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా చెబుతున్న భవిష్యత్తులో వైసీపీ వాళ్ల నోటి నుంచి ఇంకేమీ రాకుండా చేస్తామని అన్నారు. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని అన్నారు. వైసీపీ వాళ్ళకి యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం.. గొడవే కావాలంటే అభివృద్ధికి పాటుపడే గొడవ ఇస్తామని పేర్కొన్నారు.

ఆడపిల్లల మాన, ప్రాణాలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడటమే లక్ష్యమని తెలిపారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పవన్ సూచించారు. తాము ఎవరికీ అన్యాయంగా ఎదురు తిరగలేదు.. ఆడబిడ్డల గురించి, ఇంటి ఆడపడుచుల గురించి అసభ్యంగా మాట్లాడలేదని పవన్ అన్నారు. వైఎస్ షర్మిలకు కూడా భద్రత కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. వైసీపీ వాళ్ళు కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. 2019లో 151 సీట్లు వచ్చినపుడు మోసం చేయని ఈవీఎంలు 2024 లో ఎలా మోసం చేస్తాయని ప్రశ్నించారు.

- Advertisement -

ఇక జంగారెడ్డిగూడెం నుంచి ఇక్కడకు రావడానికి రెండున్నర గంటలు పట్టింద‌ని, ఇది జ‌గ‌న్ పాల‌న‌లో జంగారెడ్డిగూడెం రోడ్ దుస్థితి అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయలేద‌ని అన్నారు.. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి చూపుతోందని అన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 2,684 కోట్లు, ఐదేళ్లకు13,425 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. 14 ఏళ్ల క్రితం ఐఎస్ జగన్నాధపురం ఆలయానికి వచ్చాన‌ని, .. ఇక్కడ స్వయంబుగా వెలసిన లక్ష్మినరసింహ స్వామిని ఎప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు.

లక్ష్మీ నరసింహస్వామి 14 ఏళ్ల పరీక్ష పెట్టాడు.. గతంలో ఎదురైనా ఓటమితో జీవితం అంధకారం అయ్యింది.. అలాంటి సమయంలో జనసైనికులతో పాటు ధైర్యం ఇచ్చింది లక్ష్మీనరసింహస్వామి అని పవన్ కళ్యాణ్ అన్నారు. దీపం పథకం కేవలం వంటింట్లో వెలగడానికే కాదు.. పేదల ఆకలి తీర్చడానికి అని తెలిపారు. ఐఎస్ జగన్నాధపురం ఆలయానికి రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ పక్కాగా అమలు చేస్తాం.. హామీలు అమలు చేయకపోతే జనసైనికుల ప్రేమ ఎంత బలంగా ఉంటుందో కోపం కూడా అంతే బలంగా ఉంటుందని చెప్పారు. పదవి వచ్చాక పదింతలు ఎక్కువగా కష్టపడే వ్యక్తిని అని అన్నారు. అభిమానులు సినిమా పేర్లు జపించడం కంటే భగవన్నామస్మరణ చేస్తే ఇంకా బాగుంటుంది.. సినిమాలో ఒక సరదా మాత్రమే.. సినిమాలు ఉండాలని అన్నారు.

సనాతన ధర్మం కోసం చనిపోయే దాకా పోరాటం..
గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వానికి భజన చేశార‌ని, కానీ. ఇపుడు వారికి హనీమూన్ పిరీడ్ అయిపోయింద‌న్నారు. సనాతన ధర్మం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంద‌ని అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ‘నారసింహ వారాహి గళం’ పేరు మీద ఒక గళాన్ని ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు.. ఈ గళం ఏపీ, తెలంగాణలో కూడా పని చేస్తుందని పేర్కొన్నారు. సనాతన ధర్మం కాపాడడం కోసం చనిపోయే దాకా పోరాటం చేస్తా, అందులో సందేహం లేదని పవన్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement