Tuesday, November 5, 2024

AP – పిఠాపురం ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ కు స‌మ‌స్య‌ల వెల్లువ‌

ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌లు విన్న ఉప ముఖ్య‌మంత్రి
ప్ర‌తి ఒక్క‌రిని అప్యాయంగా ప‌ల‌క‌రింత‌
ప‌వ‌న్ తో త‌మ గోడును వినిపించుకున్న బాధితులు
స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని జ‌న‌సేనాని భ‌రోసా..
ప్ర‌తి చోట ప్ర‌జ‌ల‌తో మమేకం… నేనున్నా అంటూ హామీ

పిఠాపురం – నియోక‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌తి కార్య‌క్ర‌మంలోనూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. ఒక రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఆద్యంతం ప్రజా సమస్యలు వింటూ.. వినతులు స్వీకరిస్తూ.. పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు జ‌న‌సేనాని .. ప్రతి అడుగులో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ, సమస్య ఉన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించి బాధితులకు భరోసా నింపుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పర్యటన సాగింది. ఆయన రాక విషయం తెలుసుకుని ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రోడ్ల వెంట బారులు తీరారు. పిఠాపురం, యు.కొత్తపల్లి మధ్య ప్రజలు తమ గ్రామాల సమస్యలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై దృష్టి సారించి తక్షణ పరిష్కారానికి కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ప్రమాదంలో కాళ్లుపోయాయి.. బీమా రాలేదు

పిఠాపురం టీటీడీ కళ్యాణ మండపం వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన సమయంలో శ్రీ అబ్రహం అనే దివ్యాంగుడు కలిసి, గోడ కూలిన ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయానని, సదరం సర్టిఫికెట్ ఆలస్యం కావడం వల్ల గత ప్రభుత్వంలో బీమా ఇవ్వలేదని. అదే ప్రమాదంలో చనిపోయిన ఇరువురికీ బీమా వర్తింప చేశారని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని తన గోడు వెళ్లబోసుకున్నారు. శ్రీ అబ్రహం సమస్య పరిష్కరించాలని వెంటనే అధికారులకు సూచించారు.

అన్యాక్రాంతం అయిన రాములోరి భూములకు రక్షణ కల్పించండి

- Advertisement -

700 సంవత్సరాల చరిత్ర కలిగిన గోరస శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, ఆలయ భూములు ఆక్రమించుకున్న వారంతా సిండికేట్ గా మారి దోచుకుంటున్నారంటూ ఆ గ్రామానికి చెందిన పలువురు పిఠాపురం, యు.కొత్తపల్లి మధ్య మార్గంలో వినతిపత్రం ఇచ్చారు. సీతారామస్వామి వారి భూములకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై వెంట‌నే స్పందించిన ప‌వ‌న్ వెంట‌నే దాని సంగ‌తి చూడాల‌ని ఆదేశించారు.

నవ కండ్రవాడ గ్రామ సర్పంచ్ బి. సురేష్ తమ గ్రామంలో డ్రెయినేజ్, రహదారి సమస్యలను ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు. గ్రామంలో జీర్ణావస్థకు చేరుకున్న రామాలయాల పునర్నిర్మాణం అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఎండవల్లి జంక్షన్ సమీపంలోని వాకతిప్ప కాలనీ వాసులు తాగు నీటి సమస్యతో తాము పడుతున్న ఇబ్బందులను ఉపముఖ్యమంత్రికి వివరించారు. త‌గిన చ‌ర్య‌ల‌కు ప‌వ‌న్ వెంట‌నే అధికారుల‌కు సిపార్స్ చేశారు.

రథాలపేట కాలనీలో పవన్ కళ్యాణ్ పర్యటన

పిఠాపురం రైల్వే అండర్ పాస్ సమీపంలోని రథాలపేట రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలనీ వాసులు తమ ప్రాంతంలో పారిశుధ్యం, రంగు మారిన రక్షిత మంచినీటి సరఫరా అంశాలను విన్నవించడంతో, వెంటనే వాహనం నుంచి దిగి వెళ్లి రధాలపేట కాలనీలో పారిశుధ్యం, రక్షిత మంచి నీటి సరఫరా తీరుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాల సమస్యను కాలనీ వాసులు చెప్పడంతో, రథాలపేట కాలనీ వాసుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా కాలనీకి చెందిన మహేందర్ ఇటీవల నాలుగో అంతస్తు భవనం నుంచి పడి తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకుని అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదే సెంటర్ లో విద్యార్ధులు తమ పాఠశాలకు ఆట స్థలం కావాలని కోరారు.

గొల్లప్రోలు తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులు తారుమారు

పిఠాపురం పట్టణంలోని యానాదుల కాలనీ వద్ద కాలువపై ప్రమాదకరంగా ఉన్న సిమెంటు బల్ల వంతెన స్థానంలో శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని ఆ ప్రాంత ప్రజలు కోరడంతో, త్వరలో అందరి సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దుర్గాడ గ్రామానికి చెందిన శ్రీ కుమూరి గంగాధర్ గొల్లప్రోలు తహశీల్దార్ కార్యాలయంలో రికార్డుల తారుమారు చేశారని ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులకు అనుకూలంగా రికార్డులను తారుమారు చేసిన రెవెన్యూ, సర్వే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై చ‌ర్య‌ల‌కు ఆదేశించారు ప‌వ‌న్..

Advertisement

తాజా వార్తలు

Advertisement