ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల త్యాగాలు మరువలేనివని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని మీడియాకు పంపిన నోట్‌లో వెల్లడించారు
.
ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు..
వ్యక్తిగత జీవితంకంటే తమ విధులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారని.. విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. గత పాలకులు పోలీసు శాఖను తమ రాజకీయ అవసరాలకే ఎక్కువగా వినియోగించుకున్నారని విమర్శించారు. ఫలితంగా ఉన్నత స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకూ ఇబ్బందులు చవిచూశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పోలీసు శాఖ సమర్థంగా పని చేసేలా చూస్తోందని తెలిపారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.