సమగ్ర అభివృద్ధి నివేదిక-2024 పేరిట రిపోర్టు విడుదల
₹2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం
₹72 లక్షలతో గొల్లప్రోలులో తాగునీటి సౌకర్యం
రాష్ట్రానికి తానేం చేశాననే వివరాలను షేర్ చేసిన ఉప ముఖ్యమంత్రి
ఆంధ్రప్రభ స్మార్ట్, పిఠాపురం: పిఠాపురానికి నేనేం చేశానంటే.. అనే వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను ఈ ఆరున్నర నెలల కాలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వెల్లడించారు. కాగా, ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం నాలుగు స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో తాను ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఇక.. పిఠాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రిగా పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆరున్నర నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ‘సమగ్ర అభివృద్ధి నివేదిక-2024’ పేరిట విడుదల చేశారు.
పేదలకోసం పలు పనులు..
ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆరున్నర నెలల్లో తాను ఏం చేశాననే వివరాలను డిప్యూటీ సీఎం షేర్ చేశారు. ఇందులో భాగంగా ₹2 కోట్ల అంచనా వ్యయంతో పేదల పెళ్లిళ్ల కోసం టీటీడీ కళ్యాణ మండపం, ₹72 లక్షలతో గొల్లప్రోలులో తాగునీటి సౌకర్యం, 32 స్కూళ్లకు క్రీడా కిట్ల పంపిణీ, సీహెచ్ సీని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్, పాఠశాలలు, కాలేజీల్లో ఆర్ఓ ప్లాంట్లు సహా మరికొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి తానేం చేశాననే వివరాలను కూడా పవన్ పంచుకున్నారు.