Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP – భయపడొద్దు .. రాజీ పడొద్దు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

AP – భయపడొద్దు .. రాజీ పడొద్దు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

0
AP –  భయపడొద్దు .. రాజీ పడొద్దు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ప్రజలకు తమ శక్తి తెలిసింది
ఆఫీసర్లంటే అనుసంధాన కర్తలు
గతంలో గట్టిగా అడగలేదు
అందుకే ఇన్నీ సమస్యలు
విజన్ స్వర్ణాంధ్ర మహా సంకల్పం
అప్పట్లో విజన్ 2020 అర్థం కాలేదు
సైబరాబాద్ చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబే
విజయవాడ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ )
ఉన్నతాధికారులంటే ప్రజలకు పాలకులకు మధ్య అనుసంధానకర్తలు అని, గత అయిదేళ్లలో ఒక్క ఉన్నతాధికారైనా గట్టిగా చెప్పి ఉంటే ఈనాడు ఇన్ని సమస్యలు వచ్చేవి కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్-2047 ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. ఎంతో అనుభవంతో ముఖ్యమంత్రి రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను సమర్థంగా అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదే అని వెల్లడించారు. దయచేసి గత ప్రభుత్వంలో మాదిరిగా భయపడుతూ రాజీపడొద్దని తెలిపారు. ప్రజలు కూడా తమ శక్తిని తాము తెలుసుకుని ఎన్నికల్లో గట్టి తీర్పు చెప్పారన్నారు. ప్రజా భాగస్వామ్యంతోనే అధికారులతో గట్టిగా పని చేయించగలమని అన్నారు. ఎన్నికలప్పుడు కనబరిచిన బాధ్యతను కొనసాగించాలని పవన్ అన్నారు. నా ముక్కు సూటితనంతో రాష్ట్రానికి మంచే జరగాలి అని అన్నారు.

చంద్రబాబుపై ప్రశంసల జల్లు

ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉపముఖ్యమంత్రి అన్నారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలలను సాకారం చేసే మహాసంకల్పమన్నారు. పార్టీ పెట్టి తాను నలిగిన తర్వాతే చంద్రబాబు విలువేంటో మరింత తెలిసి ఆయనపై అపార గౌరవం పెరిగిందని చెప్పుకొచ్చారు. పార్టీ నడపటం అంటే ఆత్మహత్యా సదృశ్యంతో సమానమన్నారు. ప్రతీ ఒక్కరికీ దిక్సూచీ అవసరమన్నారు. విజన్ 2020 తన స్థాయికి అర్థం కాలేదని తెలిపారు. ఫలితాలతో విజన్ 2020 అర్థమైందన్నారు. నాడు రాళ్లు రప్పలు చూసిన ప్రాంతంలో చంద్రబాబు సైబర్ సిటీ మహానగరాన్ని చూశారన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సైబరాబాద్ రూపకర్త, శిల్పి, చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబే అంటూ కొనియాడారు. ఎంతో కష్టపడి కట్టిన ట్విన్ టవర్స్‌ను ఉగ్రవాదులు ఒక పూటలోనే కూల్చేశారని.. నిర్మాణం విలువ తెలియని గత పాలకులూ ఇదే మాదిరి వ్యవహరించారన్నారు. చంద్రబాబు ఓపికను ఎన్నిసార్లు మెచ్చుకున్నా సరిపోదు, మేం మా కోసం కలలు కంటే ఆయన ప్రజల కోసం కలలు కంటున్నారు. అలాంటి అనుభవజ్ఞుడి వద్ద పనిచేయటం ఎంతో గర్వంగా ఉంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Exit mobile version