ఢిల్లీ టూర్ విశేషాలు వివరించిన ఉప ముఖ్యమంత్రి
రాజ్యసభ సభ్యుల ఎన్నికపై సుదీర్ఘ చర్చ
కాకినాడ పోర్ట్ సందర్శనను వివరించిన పవన్
అక్రమాలకు అడ్డా పోర్ట్ మారిందంటూ వివరణ
సోషల్ మీడియా అరెస్ట్ లపై ప్రస్తావన
అమరావతి – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సిఎం నివాసానికి చేరుకున్న పవన్ ను చంద్రబాబు సాదరపూర్వకంగా ఆహ్వానించారు.. అనంతరం వీరిద్దరూ పలు అంశాలపై చర్చలు జరిపారు.
ఇటీవల తాను ఢిల్లీలో జరిపిన పర్యటన వివరాలను చంద్రబాబుకు పవన్ వివరించారు.. కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చేందుకు తాను వివిధ మంత్రులతో జరిపిన చర్చలను ప్రస్తావించారు. ఇదే సందర్భంగా రాజ్యసభ సభ్యుల ఎన్నికపై సుదీర్ఘంగా చర్చించారు.. బిజెపి ప్రతిపాదనను పవన్ ముందు చంద్రబాబు ఉంచారు.. మూడు స్థానాల అభ్యర్ధుల ఎంపిక పై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇక ఇటీవల కాకినాడ పర్యటన విశేషాలను పవన్ ముఖ్యమంత్రికి వివరించారు.. కాకినాడ పోర్టు అక్రమ రేషన్ బియ్యం తరలింపునకు అడ్డాగా మారిందన్నారు. పోర్టులపై రాష్ట్ర నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు పవన్. రేషన్ బియ్యం విదేశాలకు తరలించే కుంభకోణంలో చాలా మంది పెద్దలున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై అధికారుల నుంచి సమగ్ర నివేదిక వచ్చిన అనంతరం ఒక నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు పవన్ కు చెప్పినట్లు సమాచారం .
సోషల్ మీడియా కేసులపై…
ఇటీవల సోషల్ మీడియా కేసులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు. దీనిపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
రేపే క్యాబినేట్ భేటి
కాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4న ఈ భేటీ జరగాలి. తాజాగా మంగళవారం జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుందని.. అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి.. జీఏడీకి పంపించాలని ఆదేశించారు.