ఆంధ్రప్రదేశ్‌లో టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని, తమకు మరో బ్రాండ్ అంబాసిడర్ అవసరంలేదని ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కాకినాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ అవినీతిమయమైందని ఆరోపించారు.
వైసీపీకి టూరిజం అధికారులు అనుకూలంగా వ్యవహరించి కోట్లాది రూపాయలు దోచేశారని విమర్శించారు. ప్రక్షాళన చేయటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక, పులివెందులలో 4స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు గుప్పించారు.
ఏపీకి సినీరంగం..
తెలుగు సినిమా రంగాన్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని మంత్రి అన్నారు. ప్రైవేట్, పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్‌లో సినిమా రంగానికి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. టూరిజం అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని కోరతామన్నారు . అనంతరం దేవీపట్నం మండలం పోచమ్మ గండి వద్ద పాపికొండల పర్యాటక బోట్లను మంత్రి పరిశీలించారు. పాపికొండలు వెళ్లి వచ్చిన టూరిస్టులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. బోట్ భద్రత దృష్ట్యా అధికారులతో కలిసి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. పర్యాటకులకు అవసరమైన అన్ని సేవలను అందుబాటులో ఉంచుతామని మంత్రి హామీ ఇచ్చారు.