పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం డంపింగ్ యార్డు దగ్గర జరిగిన అఘాయిత్యం గురించి తెలిసి చాలా బాధ కలిగిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని, లేదంటే నిందితుడుఇ తప్పించుకోవడానికి ఆస్కారం కలిగేదని అన్నారు. ఈ అమానుష చర్యను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
” ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించాను. ప్రభుత్వపరంగా అన్ని విధాలా బాధితురాలికి, వారి కుటుంబ సభ్యులకు సహాయసహకారాలు అందచేస్తాము. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాము. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక జనసేన నాయకులను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, సహాయం అందించాలని ఆదేశించాను” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.