Saturday, December 28, 2024

AP – ఎంపీడీఓ పై వైసిపి నేతలు దాడి – పవన్ కళ్యాణ్ ఆగ్రహం

వెలగపూడి – గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు తీవ్రస్థాయిలో దాడి చేశారు. ఈ దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న MPDO పై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని స్పష్టం చేశారు. గాలివీడు ఎంపీడీఓపై చోటు చేసుకున్న దాడి ఘటన గురించి అధికారులతో ఆయన చర్చించారు..

కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎంపీడీఓకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించి వాకబు చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఆదేశించారు

ఇక జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యం లోనే రేపు పవన్ కడప వెళ్లనున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి, కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement