Wednesday, October 9, 2024

AP – మీ స‌ల‌హాలు రాష్ట్రాభివృద్ధికి అవసరం – నిపుణుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపు

కాలుష్య నివార‌ణ‌లో భాగ‌స్వాములు కండి
ప‌ర్య‌వ‌ర‌ణ ప‌రి ర‌క్ష‌ణ‌కు సూచ‌న‌లివ్వండి
నిపుణుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపు

విజయవాడ: కాలుష్య నివారణకు ప్రణాళికలు అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఏ పనైనా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ ముఖ్యమన్నారు. పర్యావరణం బాగుండాలని కోరుకునే వాళ్లలో తానూ ఒకరినని తెలిపారు. పర్యావరణ హితం అనేది పరిశ్రమల బాధ్యత కావాలి. అభివృద్ధిలో భాగమయ్యే పరిశ్రమలు భావి తరాలకు చక్కటి పర్యావరణం అందించడం కూడా తమ బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కావాలి.. అభివృద్ధి అవసరం అయిన నేటి తరుణంలో పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే సమయంలో సాధ్యమైనంతగా కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

విజయవాడలోని ఓ హోటల్ లో బుధవారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఎన్జీవోలు, నిపుణులు, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన వర్క్ షాపును పవన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘భావి తరాలకు భవిష్యత్తు లేకుండా చేసే అభివృద్ధి సరికాదు. కాలుష్య నియంత్రణ మండలి అనగానే పరిశ్రమలకు వ్యతిరేకం అనే భావన సరికాదు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడం, అభివృద్దిపథంలో ముందుకు సాగడం అనేవి రెండూ కీలకమైనవే. దీనికి తగిన మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. నిపుణులు దీనిపై దృష్టి పెట్టాలి. విశాఖపట్నంలో కాలుష్యం విషయంలో కాని, ఇతర ప్రాంతాల్లో తీవ్రమవుతున్న కాలుష్యం విషయంలో శాశ్వతమైన పరిష్కారం, అందరూ ఆమోదించేలా విధానం తీసుకురావల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు.

- Advertisement -

పరిశ్రమల్లో కాలుష్యంతోపాటు ప్రమాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి. వీటి నివారణకు ఓ మార్గం చూపాలి. 974 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది. దానిని అభివృద్ది చేయాలి. పర్యావరణ సమతౌల్యం దెబ్బ తినకుండా పరిశ్రమల ఏర్పాటు కావాలి. భవిష్యత్ తరాల కోసం.. మనమంతా ఇప్పటి నుంచే ఆలోచన చేయాలి. జల, వాయు కాలుష్యాలను నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. వేగవంతమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం తపిస్తున్న సమయంలో కాలుష్య రహిత పరిశ్రమలు, వాటి విధివిధానాల రూపకల్పనకు నిపుణులు, మేధావులు విలువైన సూచనలు అందించాలి. వారి సూచనలు సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. పర్యావరణం మేలు గురించి ఎన్జీవోలు చేస్తున్న కృషి అభినందనీయం. వారి సేవలను కాలుష్య నియంత్రణ మండలి ఉపయోగించుకుంటుంది. ఈ వర్కుషాపు ద్వారా పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ రెండు అంశాలపై వేసే అడుగులపై అందరికీ స్పష్టత వస్తుంది. ఈ ఐదేళ్ల కాలంలో ఎంతవరకు కాలుష్యాన్ని నియంత్రించాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు అందరూ సమష్టిగా పని చేయాలి’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య, ఏపీఐఐసీ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు అందరి సలహాలు, సూచనలు అవసరమని పేర్కొన్నారు. కాలుష్య నివార‌ణ‌కు ప్ర‌ణాళిక‌లు అవ‌స‌ర‌మ‌ని పవన్ తెలిపారు. ఈ విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు స‌రైన నిర్ణ‌యంతోనే మంచి ఫ‌లితాలు సాధ్య‌మ‌ని పవన్ పేర్కొన్నారు​​​​​.
”నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు రాష్ట్రాభివృద్ధికి అవసరం. మేం చెప్పడానికి కాదు.. వినేందుకే సిద్ధంగా ఉన్నాం. ఒక్కోసారి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని భయమేస్తోంది. కాలుష్యం పెరుగుతోంది” అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement