ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో టీడీపీ నేత పట్టాభికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. బెయిల్ పై జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు.
పట్టాభి ఎక్కడ? అనే చర్చ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సాగింది. అయితే ఉన్నట్టుండి ఫ్యామిలీతో కలిసి ఆయన మాల్దీవుల్లో ప్రత్యక్షమయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి మాలే విమానాశ్రయంలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రశాంతత కోసం విహారయాత్రకు వెళ్దామని ఆయనను భార్య చందన కోరినట్టు సమాచారం. భార్య కోరిక మేరకు పట్టాభి మాల్దీవులకు వెళ్లారట. మరోవైపు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, బెయిల్ ఇచ్చే సందర్భంగా పట్టాభికి కోర్టు ఎలాంటి షరతులు విధించలేదని.. దీంతో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ పట్టాభికి ఉంటుందని చెప్పారు.
ఇంకోవైపు పట్టాభిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను విజయవాడలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది.