Saturday, January 4, 2025

AP – శ్రీకాకుళం జిల్లాలో వలసల నివారణే కూటమి లక్ష్యం

ఆంధ్రప్రభ స్మార్ట్, శ్రీకాకుళం బ్యూరో – వలసలను నివారించడమే ధ్యేయంగా శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు , మూలపేట పోర్టులను అనుసంధానిస్తూ కోస్టల్ కారిడార్ నిర్మాణానికి డీపీఆర్ లు రూపొందిస్తున్నామని అన్నారు.

తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై గతంలో ఏ సీఎం కూడా జిల్లా అధికారులతో రివ్యూ చేసింది లేదని, జిల్లాలోని చాలా సమస్యల పరిష్కారానికి రివ్యూలో సీఎం తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

ఇరిగేషన్.. ఇండస్ట్రీలపైనే ఫోకస్

- Advertisement -

ఇరిగేషన్, ఇండస్ట్రీ ఈ రెండు మా ప్రాధాన్యతలు. జిల్లాలో నాలుగు ప్రధాన నదులున్నాయి. వీటిపై గడిచిన ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. వంశధార పేజ్ 2, స్టేజ్ 2 పనులను జూన్ 2025 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం. 19 టీఎంసీలు నీటిని నిలవచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. నాగావళి, వంశధార నదుల అనుసంధానం పూర్తి చేస్తాం. ఇందులో 5000 ఎకరాలు ముంపునకు గురికాకుండా కొత్త డిజైన్లు రూపొందించమని, భూసేకరణ సమస్యలు పరిష్కరించమని చెప్పాం. ఆప్సోర్ ప్రాజెక్టు కోసం నూతన డిపిఆర్ వెయ్యమన్నాం. పలాస మండలంలో కేదారి పురం వద్ద మూడు కిలోమీటర్ల పైప్ లైన్ వేసి పలాస కాశీబుగ్గ జంట పట్టణాలకు మంచినీటిని అందిస్తాం. బహుద నది పై పలు కీలక పనుల కోసం రూ.30 కోట్లు అవసరం. ఈదుపురంలో ఎత్తిపోతల పథకం, 11 ఓపెన్ హెడ్ చానల్స్, పైడిగం ప్రాజెక్టు అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తాం. అని కేంద్ర మంత్రి అన్నారు.

శిక్కోలుకు టైటానియం కాంప్లెక్స్ :మూలపేట పోర్టు సమీపంలో పదివేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇక్కడ ఫార్మా హబ్, బయోటెక్ హబ్ నిర్మిస్తాం. ఏడాదిలో పోర్టు పూర్తవుతుంది. 20వేల కోట్ల టర్నోవర్ జరిగేలా బీచ్ సాండ్ ప్రాజెక్టులు కూడా అభివృద్ధి చేస్తాం. 20వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇసుక నుంచి ముఖ్య ఖనిజాలను వేరు చేసే టైటానియం కాంప్లెక్స్ ను ఇక్కడ స్థాపిస్తాం. మూలపేట సమీపంలో ఎయిర్ పోర్టు నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. . రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ :నరసన్నపేట జమ్ము జంక్షన్ నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిని ఆరు లైన్లుగా రూపొందిస్తాం. కళింగపట్నం- పార్వతీపురం రోడ్డు, బత్తిలి- అలికాం రోడ్డు జాతీయ రహదారుల సంస్థ పరిధిలోకి వెళ్లేలా ప్రయత్నిస్తున్నాం. డోల- పోలాకి- నౌపడ రోడ్డు అభివృద్ధికి జాతీయ రహదారి సంస్థ నిధులు అడిగాం. శ్రీకాకుళం నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా చేసాం అని కేంద్ర మంత్రి వివరించారు.

టెంపుల్ టూరిజం :ప్రసాదం అనే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు తో జిల్లాలో అరసవెల్లి, శ్రీకూర్మం దేవాలయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ప్రపంచ ప్రసిద్ధ దేవాలయానికి ప్రసాదం పథకం తో నిధులు తెస్తాం. అని మంత్రి హామీ ఇచ్చారు.

క్రీడలకూ పెద్దపేట :కోడి రామ్మూర్తి స్టేడియం త్వరగా పూర్తి చేస్తాం. పాత్రుని వలసలో 33 ఎకరాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాం. ఖే లో ఇండియా పథకంలో ప్రతిపాదనలు పూర్తి చేశాం. నాలుగు ప్రత్యేక సింథటిక్ స్పోర్ట్స్ మైదానాలు నిర్మిస్తున్నాం. క్రీడా వికాస ప్రాంగణాలు పూర్తి చేస్తాం. మన జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి సహాయాన్ని కోరాం. జిల్లాలో క్రీడాభివృద్ధికి ఆమె సమయాన్ని వెచ్చిస్తాం. జిల్లాలో ప్రస్తుతం యువ నాయకత్వం ఉంది. యువకులైన ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా యంత్రాంగం ఎవరూ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారు, అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

విలేఖరుల సమావేశంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement