Friday, November 22, 2024

ఏపీ ఒడిశా చర్చలు స‌ఫ‌లం.. జ‌ల వివాదంపై అధికారుల‌తో జాయింట్ కమిటీ..

(ప్రభ న్యూస్‌ బ్యూరో) : శ్రీకాకుళం, నవంబర్‌ 9 : ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్రకు సంబంధించిన జల వివాదాలు ముఖ్యంగా వంశధార ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నేరడి బ్యారేజ్‌ నిర్మాణం, ఇతర సమస్యలపై మంగళవారం సాయంత్రం ఇరు రాష్ట్రాల్ర ముఖ్యమంత్రుల మధ్య భువనేశ్వర్‌ లో కీలక చర్చలు ఫలప్రదమయాయని స్పష్టమవుతోంది..

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మధ్య దాదాపు 2గంటలపాటు- చర్చలు జరిగాయి.. జల వివాదాల పరిష్కారానికి ఇరు ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులతో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ-ని ఏర్పాటు- చేయాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సమావేశంలోని కొన్ని ముఖ్య విషయాలను భువనేశ్వర్‌ నుంచి తెలియచేసారు.

ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలా సమావేశం కావడం ఒక చారిత్రాత్మక ఘట్టమన్నారు. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న జలవివాదాలకు ఒక సానుకూల పరిష్కారం కుదిరిందని తెలిపారు . వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, విజయనగరం జిల్లాకు సంబంధించి జంఝావతి ప్రాజెక్టు, కొటియా గ్రామాల అంశాలపై చర్చించారన్నారు. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఉభయ రాష్ట్రాల్రకూ కలగనున్న ప్రయోజనాలను ఒడిస్సా ముఖ్యమంత్రికి వివరించామని తెలిపారు. బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా వైపునుంచి 103 ఎకరాలు అవసరమని, ఇందులో 67 ఎకరాలు రివర్‌ బెడ్‌ ప్రాంతమేనని, గ్రామాలు ముంపునకు గురికాకుండా కరకట్టల నిర్మాణం జరుగుతుందని తెలిపామన్నారు .

బ్యారేజీ నిర్మాణం వల్ల శ్రీకాకుళం జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు సాగునీరు అందడం వల్ల ఉజయగోదావరి జిల్లాల స్థాయికి చేరుతామన్నారు. అంతేకాకుండా ఒడిశావైపు కూడా సుమారు 6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని తెలిపారు. 1962లో అప్పటి ముఖ్యమంత్రులు నదీజలాల విషయంలో సమావేశమయ్యారని, ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వంశధార – 2వ దశకు సంబంధించి ముందుకు సాగామని, మళ్లీ ఇన్నాళ్లకు సీఎం వైఎస్‌ జగన్‌ కృషితో రైతుల కలలు సాకారం కానున్నాయన్నారు . ఇది కాకుండా ఇంకా మరి కొన్ని అంశాలపై ఇద్దరు సీఎంల మధ్య చర్చలు జరిగాయని తెలిపారు.. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి వి ఉషారాణి నేరడి బ్యారేజ్‌, భూసేకరణ తదితర అంశాలపై పవర్పాయింట్‌ ప్రెజెంటేషన్‌ చేసి వివరించారు. సీఎంల భేటీ-లో, పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ లో రాష్ట్ర డిజిపి గౌతమ్‌ సవాంగ్‌, ఇరిగేషన్‌ ముఖ్య కార్యదర్శి జే. శ్యామలరావు, ముఖ్యమంత్రి ఓఎస్డి కాల్వ ధనుంజయరెడ్డి, వంశధార ఎస్‌ఇస్‌ఐ డోల తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement