Saturday, November 23, 2024

AP: బకాయిలు చెల్లిస్తే ఎవరూ రోడ్డెక్కరు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని చెరకు రైతుల ఇబ్బందులు, సమస్యలను ప్రభుత్వం ఎందుకు పట్టించు కోవడం లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరకు రైతులకు రెండు సీజన్లుగా రూ. 90 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, వాటిని చక్కెర పరిశ్రమల నుంచి ఎందుకు ఇప్పించడంలేదో చెప్పాలని ధ్వజమెత్తారు. గురువారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద బకాయిల కోసం రైతులు చేస్తున్న ఆందోళనపై ఆయన స్పందించారు. గడిచిన నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని, దీంతో సమస్య తీవ్రమైందని పేర్కొన్నారు.

గడిచిన రెండేళ్లుగా ఆ ఫ్యాక్టరీ రైతులకు రూ. 16.38 కోట్ల బకాయిలు పడిందని దీనిని సత్వరమే రైతులకు ఇప్పించాల్సిన అధికార యంత్రాంగం ఈ సమస్యను శాంతిభద్రతల అంశంగా చూడటం భావ్యం కాదని అన్నారు. మనకు తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు నిండుతుందని, ఇలాంటి తరుణంలో సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు అరెస్టులకు దిగి రైతుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచారని విమర్శించారు. పాలకుల నిర్లక్ష్యంతో ఆందోళన చేస్తున్న రైతులు పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు నలిగిపోతున్నారని ఆరోపించారు.

రెండేళ్ల బకాయిలను తక్షణమే ఇప్పించాల్సిన పాలకులు వచ్చే ఏడాది జనవరిలో చెల్లింపులు చేసేలా కంపెనీ యాజమాన్యాన్ని ఒప్పిస్తామని ప్రతిపాదించడం రైతులను వంచించడమేనని పవన్‌ కళ్యాణ్‌ మండిపడ్డారు. రైతులకు షుగర్‌ ఫ్యాక్టరీల నుంచి బకాయిలు వచ్చేలా సమన్వయం చేయాల్సిన షుగర్‌ కేన్‌ విభాగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. చెరకు తోలిన రైతులకు 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని కంపెనీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని, అయినప్పటికీ రెండు సీజన్ల బకాయిలు ఉన్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో స్పష్టమౌతుందన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా బకాయిలు వసూలు చేసే అవకాశం ఉన్నా.. ఆ చట్టాన్ని వినియోగించకపోవడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే చెరకు రైతులకు బకాయిలు ఇప్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement