Friday, November 22, 2024

AP – విలేక‌రి హ‌త్య – మాజీ మంత్రి దాడిశెట్టికి ముంద‌స్తు బెయిల్ నో

అయిదేళ్ల క్రితం జ‌రిగిన హ‌త్య‌
వైసిపి ప్ర‌భుత్వంలో క‌ద‌ల‌ని ద‌ర్యాప్తు
కూట‌మి వ‌చ్చాక మ‌ళ్లీ విచార‌ణ ప్రారంభం
దీంతో ముందస్తు కోసం హైకోర్టుకు
దాడిశెట్టికి బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌ర‌ణ

అమ‌రావ‌తి – వైసిపి నేత , మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో తుని రూరల్‌ పోలీసులు రాజాపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.

వివ‌రాల‌లోకి వెళితే తుని నియోజకవర్గం తొండంగి మండల ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న కాతా సత్యనారాయణ (47).. 2019 అక్టోబరు 15న రాత్రి 7 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై ఎస్‌.అన్నవరంలోని ఇంటికి వెళ్తున్నారు. అక్కడి లక్ష్మీదేవి చెరువుగట్టుపై కొందరు అడ్డగించి కత్తులతో నరికి చంపారు. హత్యకు దాడిశెట్టి రాజా సూత్రధారి అనేది మృతుని కుటుంబీకుల ఆరోపణ. వారి ఫిర్యాదుతో తుని రూరల్‌ పోలీసులు కేసు నమోదుచేశారు.

దాడిశెట్టి సహా ఆరుగురిని నిందితులుగా చేర్చారు. రాజా మంత్రి అయ్యాక దర్యాప్తు ముందుకు సాగలేదు. 2023లో ఛార్జిషీటులో ఆయన పేరు తప్పించారు. నిందితులను శిక్షించాలంటూ సత్యనారాయణ సోదరుడు, న్యాయవాది కాతా గోపాలకృష్ణ పోరాడారు. రాజాపై చర్యలు తీసుకోవాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌హెచ్‌ఆర్‌సీతో పాటు.. హైకోర్టును ఆశ్రయించారు. తుని నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర వచ్చినప్పుడు నారా లోకేశ్‌ను కలిసి న్యాయం చేయాలని విన్నవించారు. కూటమి ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని లోకేశ్‌ అప్పట్లో భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో దాడిశెట్టి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరిగి కేసు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలోనే దాడిశెట్టి ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇరు వ‌ర్గాల వాద‌ల‌ను విన్న హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement