కర్నూలు బ్యూరో – మాజీ సీఎం జగన్ రాయలసీమ బిడ్డ అయినా ఇక్కడ ఇరిగేషన్ పథకాలను పట్టించుకోలేదని ఎపి నీటి పారుదల శాఖ మంత్రి , కర్నూలు ఇంచార్జ్ మంత్రి రామానాయుడు అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆయన నగరంలోని ఉల్లి మార్కెట్ ను తనిఖీ చేశారు. ఆయనతోపాటు పరిశ్రమల శాఖ, ఐటిమంత్రి టిజి భరత్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ , ఉల్లి రైతుకు ఒక్క రూపాయు కూడా నష్టం జరగకూడదన్నారు. వినియోగ దారుడుకి భారం కాకుండా మేలు జరిగేలా ఎన్డీయే కూటమి పని చేస్తుందన్నారు.
ఈనామ్ పని చేయకపోతే వెంటనే ఆఫ్లైన్ లో నమోదు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. గత ఏడాది అక్టోబర్ లో 52 వేల టన్నుల ఉల్లి వస్తే దానికి నాలుగు రేట్లు అధికంగా అనగా 2.5 లక్షల టన్నుల ఉల్లి అధికంగా ప్రస్తుతం మార్కెట్కు వచ్చినట్లు గుర్తు చేశారు.
గత ప్రభుత్వంలో హార్టికల్చర్ , డ్రిప్ ఇరిగేషన్ వంటివి అన్నింటినీ గాలికొదిలేశారన్నారు. దళారులు సిండికేట్ అవ్వకుండా కోడుమూరులో కూడా ఉల్లిమార్కెట్ ను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
నిమ్మలతో జిల్లా ఎస్పీ మర్యాదపూర్వక భేటి..
కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి,రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడుని కర్నూల్ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ కర్నూలు ప్రభుత్వ అతిథిగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోమవారం ఇంచార్జ్ మంత్రికిఎస్పీ పూల మొక్కను అందజేశారు. ఎస్పీతో పాటు కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు, కర్నూల్ టిడిపి ఇన్చార్జి తిక్కారెడ్డి, కర్నూల్ డిఎస్పి జె.బాబు ప్రసాద్ ఉన్నారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహంలో వారి వివిధ అంశాలపై చర్చించారు.