Tuesday, November 26, 2024

AP – స‌త్వ‌ర న్యాయం కోసం వారు చేస్తున్న కృషి ప్ర‌శంస‌నీయం – జ‌స్టిస్ అరుణ్ మిశ్రా

( ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో )దేశంలో మాన‌వ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) క‌షిచేస్తోంద‌ని.. రాష్ట్రంలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న కేసులకు సంబంధించి విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన క్యాంప్ సిట్టింగ్‌, ఓపెన్ హియ‌రింగ్ ఫ‌ల‌ప్ర‌దంగా ముగిసిన‌ట్లు ఎన్‌హెచ్ఆర్‌సీ ఛైర్‌ప‌ర్స‌న్ జ‌స్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు.

.జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌ప‌ర్స‌న్ జ‌స్టిస్ అరుణ్ మిశ్రా సార‌థ్యంలోని బృందం బుధవారం న‌గరంలోని లబ్బీపేట పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న కేసుల విచార‌ణ‌కు క్యాంప్ సిట్టింగ్ నిర్వ‌హించింది.

ఈ కార్య‌క్ర‌మంలో కమిషన్ సభ్యుడు డాక్టర్ డి.ఎం.మూలే, రాజీవ్ జైన్, విజయభారతి సయాని, సెక్రటరీ జనరల్ భరత్ లాల్, రిజిస్ట్రార్ (లా) సురాజిత్ డే, క‌మిష‌న్ సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు. క్యాంప్ సిట్టింగ్ ముగిసిన త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. అదే విధంగా స్వ‌చ్ఛంద సంస్థ‌లు, పౌర స‌మాజ సంస్థ‌లు, మాన‌వ హ‌క్కుల ప‌రిర‌క్ష‌కుల‌తో స‌మావేశమ‌య్యారు.

అనంత‌రం అరుణ్ మిశ్రా.. క‌మిష‌న్ స‌భ్యులు, సీనియ‌ర్ అధికారుల‌తో క‌లిసి మీడియా స‌మావేశంలో మాట్లాడారు. క్యాంప్ సిట్టింగ్‌లో 30 కేసుల‌ను విచారించి, త‌గిన మార్గ‌ద‌ర్శ‌కాలు, ఆదేశాలు జారీచేసిన‌ట్లు తెలిపారు. సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారులు, ఫిర్యాదుదారుల స‌మ‌క్షంలో కేసులను విచారించిన‌ట్లు పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల హాస్ట‌ల్ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఆదేశాలిచిన‌ట్లు తెలిపారు. స‌ర్పంచ్‌ను పోలీసులు అక్ర‌మంగా క‌స్ట‌డీలో ఉంచిన కేసులో రూ. 25 వేలు పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశాలను జారీచేసిట్లు వెల్ల‌డించారు. పింఛ‌నుదారు ప్రయోజనాల ఆల‌స్య చెల్లింపుపై వడ్డీ చెల్లించాలని ఆదేశించడం వంటివి చేసిన‌ట్లు వివ‌రించారు. మొత్తంమీద క్యాంపు సిట్టింగ్ సంద‌ర్భంగా రూ. 80 ల‌క్ష‌ల మేర ప‌రిహార చెల్లింపుల‌కు సిఫార్సు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

17 కేసుల్లో తుది ఉత్త‌ర్వులు జారీచేయ‌డం జరిగింద‌ని.. వీటిలో అయిదు అంశాల‌కు ప‌రిహారాలకు సిఫార్సు చేసిన‌ట్లు తెలిపారు. లైంగిక నేరాల కేసుల్లో బాలబాలికలకు నష్టపరిహారం విషయంలో పోస్కో కోర్టు ముందు ప్రతిపాదనలు ఉంచాలని కమిషన్ అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు వివ‌రించారు. ప‌రిహారం విష‌యంలో ఎన్ఏఎల్ఎస్ఏ రూపొందించిన మార్గదర్శకాల‌ను నిర్ధారించుకోవాల‌ని సూచించిన‌ట్లు తెలిపారు.స‌కాలంలో నివేదిక‌ల స‌మ‌ర్ప‌ణ‌తో బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం:రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, సీనియ‌ర్ అధికారుల‌తో కూడా కమిషన్ సమావేశమైన‌ట్లు తెలిపారు.

- Advertisement -

మానసిక ఆరోగ్యం, వెట్టి చాకిరీ, ఆహార భ‌ద్ర‌త హ‌క్కు, జ్యుడీషియల్-పోలీసు కస్టడీలో ఆత్మహత్యల నివారణ త‌దిత‌ర అంశాల‌పై కమిషన్ జారీచేసిన వివిధ సలహాలపై కార్యాచ‌ర‌ణ నివేదిక‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని కోరిన‌ట్లు వివ‌రించారు. బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం అందించేందుకు వీలుగా అధికారులు స‌కాలంలో నివేదిక‌లు అందించాల‌ని సూచించిన‌ట్లు తెలిపారు. దీనివ‌ల్ల బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రుగుతుంద‌న్నారు.కేసుల విచార‌ణ అనంత‌రం స్వ‌చ్ఛంద సంస్థ‌లు, పౌర సమాజ సంస్థలు, మానవ హక్కుల ప‌రిరక్షకుల ప్రతినిధులతో కూడా స‌మావేశం నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని..

వినికిడి లోపం ఉన్నవారు, మెంట‌ల్లీ ఛాలెంజ్డ్ విద్యావ‌కాశాలు పొంద‌డంలో త‌లెత్తుతున్న ఇబ్బందులు, బాలల గృహాల్లో చిన్నారులపై వేధింపులు, అక్రమ రవాణా వంటి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి వివిధ అంశాల‌ను స‌మావేశంలో లేవ‌నెత్తిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో స్వ‌చ్ఛంద సంస్థ‌లు, మాన‌వ హ‌క్కుల ప‌రిర‌క్ష‌కులు చేస్తున్న కృషి ప్ర‌శంస‌నీయ‌మైన‌ద‌ని.. నిర్భ‌యంగా, నిష్ప‌క్ష‌పాతంగా వీటిని కొన‌సాగించాలంటూ ప్రోత్స‌హించిన‌ట్లు వివ‌రించారు. దేశంలో మాన‌వ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయడంలో వీరి భాగ‌స్వామ్యం ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని స్ప‌ష్టంచేసిన‌ట్లు తెలిపారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆన్‌లైన్‌లో hrcnet.nic.in ద్వారా ఫిర్యాదు చేయొచ్చ‌ని సూచించారు.

దుర్గమ్మ సేవలోజాతీయ హ్యూమన్ రైట్స్. బృందం

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానము లోని జగన్మాత సేవలో జాతీయ మానవ హక్కుల చైర్ పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా బృందం పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం శ్రీ అమ్మవారి ఆలయానికి ఈ బృందం విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలికారు.

వీరు శ్రీ అమ్మవారి పంచ హారతుల సేవలో పాల్గొన్నారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా రామారావు అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం , చిత్రపటం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు, సంయుక్త కలెక్టర్ సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement