ఆమరావతి రైల్వేలైనుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాజధానికి రైల్వే కనెక్టివిటీ వల్ల దేశంలోని అన్ని రాజధానులను అనుసంధానం చేసేందుకు వీలుగా కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
సీఎం చంద్రబాబు ఆన్ లైన్ లో కేంద్రం మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధ్వేరితో మాట్లాడారు.
.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అమరావతి రైల్వే లైన్ కు ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిమండలికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అమరావతికి ఈ రైల్వే లైను వేయడం వల్ల దేశంలోని అన్ని రాజధాని నగరాలకు అనుసంధానంగా ఉంటుంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా నగరాలను ఈ రైల్వేప్రాజెక్టు కలుపుతుంది. రూ. 2,245 కోట్లతో 57 కి.మీ. మేర చేపట్టనున్న ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేస్తే మరింత ఉపయోగపడుతుందని కోరుతున్నా. కృష్ణానదిపై నిర్మించే 3.2 కిమీ రైల్వే వంతెనను ఐకానిక్ బ్రిడ్జిగా మార్చాలని కోరుతున్నా. దేశంలోనే అమరావతి వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు బెస్ట్ సిటీగా ఉంటుంది. రాజధాని నిర్మాణానికి కేంద్రం కూడా వివిధ మార్గాల్లో సాయం అందిస్తోంది.
. ఈ లైను నిర్మాణంలో భాగంగా 25 లక్షల చెట్లను నాటడం ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ నివారించవచ్చు. రాష్ట్రంలో రూ.72 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఎప్పటి నుండో పెండింగులో ఉన్న రైల్వే జోన్ సమస్యను కూడా పరిష్కరించుకున్నాం అని తెలిపారు.వచ్చే నెల లేదా డిసెంబరులో మంచి ముహూర్తం చూసి రైల్వే జోన్ కు ప్రధాని మోదీతో శంకుస్థాపన కూడా చేయిస్తాం. ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.
రాష్ట్రం నుండి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కూడా తగిన సమయంలోనే అందిస్తాం. 10 రోజుల క్రితమే ఢిల్లీలో పర్యటించినప్పుడు అమరావతి రైల్వే కనెక్టివిటీ గురించి ప్రధాని మోదీతో మాట్లాడాను…ఇంత తక్కువ సమయంలో కేబినెట్ ఆమోదించడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం.’ అని అన్నారు.
పవన్ చొరవతోనే ఆమోదం
అమరావతి రైల్వే ప్రాజెక్ట్ ఏపీకి పెద్ద బూస్ట్ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ ప్రజల కలను కేంద్రం నెరవేర్చిందనీ అన్నారు.
కాగా, పవన్ చొరవతో రైల్వేలైన్‌కు మోడీ ఆమోదం తెలిపారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉంటుందన్నారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానం చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. పరిటాల వద్ద మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ వస్తుందని తెలిపారు. ఏపీలో 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు
ఏపీకి ఇది చారిత్రాత్మక రోజు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు. రాజధాని నుంచి ఏ ప్రాంతానికైనా అనుసంధానం కీలకమని తెలిపారు. 10 రోజుల సమయంలో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనలు కేంద్ర కేబినెట్ ముందుకు తెచ్చారని చెప్పారు.