Saturday, October 19, 2024

AP – ఆపన్నులకు ఆత్మీయ భరోసా …. విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్

విశాఖలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్
ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి అర్జీలు స్వీకరణ

ఆంధ్రప్రభ స్మార్ట్‌, విశాఖపట్నం బ్యూరో : విశాఖలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటనలో భాగంగా శ‌నివారం ఉదయం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై స్వయంగా మంత్రిని కలిసి విన్నవించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారా లోకేష్.. వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు.

గోడు వినండి.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి
ఎలాంటి ఆధారం లేని తమకు టిడ్కో ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని విజయనగరం జిల్లా బొద్దూరుకు చెందిన వావిలపల్లి హేమలత కోరారు. ఏపీ టూరిజం కార్పొరేషన్‌లో తనకు ఉద్యోగం కల్పించాలని బొద్దూరుకు చెందిన వావిలపల్లి వేణుగోపాలరావు విజ్ఞప్తి చేశారు. 1998 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని డీఎస్సీ 1998 టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటుచేసి నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలని విశాఖకు చెందిన దేవగుప్త రమేష్ కోరారు. మీ-సేవ సీఎస్ సీ సెంటర్ లాగిన్ ఐడీని పునరుద్ధరించాలని గొల్లలపాలెంకు చెందిన కే.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూమి విక్రయించి తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని విశాఖకు చెందిన ఆర్.లక్ష్మి కోరారు. దివ్యాంగురాలైన తన కుమార్తెకు గత ప్రభుత్వం పెన్షన్ నిలిపివేసిందని, తిరిగి పునరుద్ధరించాలని విశాఖకు చెందిన పుక్కళ్ల అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement