Thursday, December 12, 2024

AP – అమాత్యుడిగా నాగేంద్రుడు … జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జీల‌ను వ‌రించిన మంత్రి ప‌ద‌వులు

చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలోకి ఎంట్రీ
జ‌గ‌న్ హ‌యాంలో ఫైర్ బ్రాండ్ రోజాకు అవ‌కాశం
కూట‌మి స‌ర్కారులో సహసశీలి నాగ‌బాబుకు చాన్స్‌
జ‌బ‌ర్ద‌స్త్‌ను వీడినా.. జనం మదిలో అదే అభిమానం
టీవీ లైవ్ నుంచి జనం లైఫ్‌లోకి రీ ఎంట్రీ
సంతోషం వ్య‌క్తం చేస్తున్న అభిమానులు

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్ : జబర్దస్త్‌.. ఈ పేరు వినగానే మొములో న‌వ్వులు పూస్తాయి.. తొలినాళ్ల‌లో రోజా, నాగబాబు నవ్వుల స్పందనకు టీవీ ప్రేక్షకులు మంత్ర ముగ్దులు అయ్యారు. ఇదే వేదికపై వీరిద్దరిలో రోజా చెణుకులు, నాగబాబు ప్రశంసలు అంద‌రినీ అల‌రించాయి. ప్రస్తుతం వీరిద్దరూ జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పేసినా.. జ‌నాల మ‌దిలో వీరు జ‌బ‌ర్ద‌స్త్‌గానే నిలిచిపోయారు. కొంత‌కాలం టీవీ ఫ్రేములో ప్రేక్షకులను అలరించిన ఈ సినీ జ‌డ్జీలు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో జనం మదిలో అభిమాన నాయకులయ్యారు. జబరస్త్ కుర్చీ యోగం కాస్త వీరిద్ద‌రికీ అమాత్య హోదాను అందించిందనే చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ హ‌యాంలో రోజా పర్యాటక, క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా కొణిదెల నాగబాబును మంత్రి పదవి వరించింది. ఇక హోదా నిర్దారణే ఆలస్యం.

- Advertisement -

రాజ‌కీయాల్లో ఓడి గెలిచిన రోజా..

ఇద్దరూ టాలీవుడ్ స్టార్లే. ఒకరు హీరోయిన్.. మరొకరు విలక్షణ నటుడు, ప్రఖ్యాత సినీ నిర్మాత. వీరిని ప్రేక్షక అభిమానులు రాజకీయ దృష్టితో ఎప్పుడూ చూడలేదు. సొట్టబుగ్గల రోజా చిరునవ్వులకు జనం ఫిదా అయితే.. నాగబాబు తన సీరియస్ నటనతో అంద‌రి గుండెల్లో నిలిచిపోయారు. రోజా లేనిదే జబర్దస్ట్ లేదు అనేంతలా కార్యక్రమం నడిచేది. 2004లో రోజా పొలిటికల్ వైపు మళ్లారు. రాజకీయాల్లో పునాది వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గంలో రెండు సార్లు ఓడిపోయారు. ఇక‌.. రోజా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అని అంతా అనుకున్నారు. కానీ, 2014 నుంచి ఆమె జీవితం మలుపు తిరిగింది. వైసీపీ నాయకురాలిగా, నగరి ఎమ్మెల్యేగా తన సత్తా చాటారు. 2019 ఎన్నికల్లోనూ విజ‌యం సాధించినా ఆమెకు పదవి రాలేదు. 2020లో ఏపీ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన మండలి చైర్మన్‌గా కేబినేట్ హోదా లభించింది. 2022లో మంత్రిగా అవ‌కాశం ద‌క్కింది.

జ‌న‌సేనానికి అండ‌గా..

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి చెందిన కొణిదెల నాగబాబు నటుడిగా.. నిర్మాతగా జనం మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2013 నుంచి 2019 వరకూ జబరదస్త్ జడ్జీగా వ్యవహరించారు. సహజ సహనశీలిగా ఉన్నారు. 2019లో నాగబాబు కెరీర్ కాస్త పొలిటికల్ స్క్రీన్‌పైకి మళ్లింది. జనసేన ప్రధాన నాయకుడిగా.. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. 2,50,289 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సినీ గ్లామర్ పని చేయలేదు. కానీ నాగబాబు నీరసపడలేదు. ప్రజలతో మమేకం అయ్యారు. తమ్ముడు, జ‌న‌సేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ వెంటే పయనించారు. అయిదేళ్లూ జనసేన పార్టీలో కార్యకర్తలకు అండగా నిలిచారు.

చంద్ర‌బాబు స‌ముచిత నిర్ణ‌యం..

2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీ స్థానంలో నాగ‌బాబు పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ, కూటమి నిర్ణయాలకు కట్టుబడ్డారు. పార్టీ కోసమే ఆలోచించారు. కూటమి ప్రభుత్వంలో అత్యుత్తమ స్థానం దక్కాలని జనసైనికులు ఎదురు చూశారు. రాజ్యసభ సభ్యుడి హోదా లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.. కానీ కథ కీలక మలుపులు తిరిగింది. రాజ్యసభ స్థానంలోనూ అవకాశం ద‌క్క‌లేదు. మళ్లీ త్యాగమే తెరమీదకు వచ్చింది. ఆయన సహనశీలత్వానికి సముచిత గౌరవం ఇవ్వటానికి టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

అదే వారికి మ‌హామోగం..

చంద్ర‌బాబు మంత్రి వర్గంలో అంత‌గా ప‌నితీరు చూప‌ని ఆరుగురు మంత్రులకు ఫ్యాక్ అప్ తప్పదు. ఈ స్థితిలో కొణిదెల నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు పెద్దల సభలో స్థానం గ్యారెంటీ. ఈ స్థితిలో చంద్రబాబు సిక్స్ ప్యాక్ లో.. జనసేన నుంచి నాగబాబు మరో అతిరథుడుగా రంగం ప్రవేశం ఖాయమైంది. ఇక్కడ పొలిటికల్ ఎనలిస్టులు అంచనా ప్రకారం ఫైర్ బ్రాండ్ రోజాకు వైసీపీ అధినేత జగన్ హంస వాహనాన్ని ప్రసాదిస్తే.. సహనశీలి నాగబాబు పెద్దల సభ సారథ్యానికి మహా రథాన్ని చంద్రబాబు అప్పగిస్తున్నారు. ఎనీ హౌ.. జబర్దస్త్ జ‌డ్జీ యోగమే వీరికి మాహా యోగంగా మారింద‌ని జ‌నం అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement