(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎంపి కేశినేని శివనాథ్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా. విజయవాడలోని పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేసి ఆ సమస్యలను వివరించారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఓల్డ్ రాజరాజేశ్వరావుపేట నిర్వాసితుల సమస్య పరిష్కరించేందుకు చొరవ చూపాలని సీఎం చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు.
పాత రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో రైల్వే శాఖకు చెందిన స్థలంలో నివాసం ఉంటున్న నివాసితులు పదిహేను రోజుల్లోగా ఖాళీ చేయాలని రైల్వే అధికారులు చాటింపు వేయించారని… తమ ఇళ్లు కూల్చి వేసి ఖాళీ చేయిస్తారని బాధితులు అందోళన పడుతున్నారని తెలిపారు. తక్షణం కూల్చివేత చర్యలు నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవటం తోపాటు… ఆ తర్వాత ఈ సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) కొండపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో లాజిస్టిక్ పార్క్ అభివృద్ధి కోసం ఆసక్తి చూపిన ఆ స్థలాన్ని ఎన్‌హెచ్ఏఐకి అందజేయడానికి ఏపీసీఆర్‌డీఏకు అవసరమైన భూమిని అప్పగించవలసిందిగా ఏపీజెన్‌కోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.