Saturday, November 23, 2024

ఇక కౌంటింగ్ టెన్షన్.. వందశాతం పోలింగ్

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు ఉదయం 9 గంటలకు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రితో పాటు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఓటు వేయడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.

కుమారుడి వివాహం కారణంగా అప్పలనాయుడు ఆలస్యంగా వచ్చి ఓటు వేశారు. వివాహం అనంతరం ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి విజయవాడకు వచ్చి వైసీపీ ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పలనాయుడు కోసం వైసీపీ చాపర్‌ను పంపించింది. విశాఖ నుంచి గన్నవరంకు వైసీపీ ఎమ్మెల్యే చేరుకున్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీకి చేరుకుని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. దీంతో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు కౌంటిగ్ ప్రక్రియ మొదలు కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement