Sunday, December 8, 2024

AP – ప్ర‌శాంతంగా కొనసాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

కాకినాడ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేటి ఉద‌యం ప్రారంభ‌మైంది. కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నిక కోసం కాకినాడ, రాజమహేంద్రవరం, అల్లూరి సీతామరాజు జిల్లాల్లోని మొత్తం 113 మండలాల్లో 116 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలానికి ఒకటి చొప్పున రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖ భవనాల్లో కేంద్రాలు పెట్టారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అల్లూరి సీతామరాజు జిల్లా వై.రామవరం మండలంలో అదనంగా మరొకటి ఏర్పాటు చేశారు.

ఉప ఎన్నికలో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఓటును సంఖ్య రూపంలో వేయాలి. బ్యాలెట్‌ పత్రంలో అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో సంఖ్య ఉంటుంది. ఓటరు తన ప్రాధాన్యతలో సంఖ్య తప్పకుండా వేయాలి. లేదంటే అది చెల్లదు.

- Advertisement -

పోటీలోని అభ్యర్థులందరికీ ప్రాధాన్యం ఇస్తూ ఓటేసే వెసులుబాటు ఉంది. అభ్యర్థులకు బ్యాలెట్‌ పేపరులో సంఖ్యలు కేటాయించారు. గంధం నారాయణరావుకు 1, దీపక్‌ పులుగుకు 2, డాక్టర్‌ నాగేశ్వరరావు కవలకు 3, నామన వెంకటలక్ష్మి(విళ్ల లక్ష్మి)కు 4, బొర్రా గోపీమూర్తికి 5వ సంఖ్యను కేటాయించారు.

ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 92వ పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 896, అత్యల్పంగా అల్లూరి జిల్లా వై రామవరం మండలం డొంకరాయి ఏడో నెంబర్ పోలింగ్ కేంద్రంలో ముగ్గురు ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్‌ వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement