Saturday, November 2, 2024

AP- మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి … చంద్రబాబు దిగ్ర్భాంతి

అనంత‌రం హత్య చేసి శ‌వం పూడ్చివేత‌
తిరుప‌తి జిల్లా వ‌డ‌మాట‌పేట‌లో ఘ‌ట‌న‌
బంధువే కీచకుడు
చంద్రబాబు దిగ్బాంతి..10 లక్ష‌ల న‌ష్ట‌పరిహారం ప్ర‌క‌ట‌న
ఘ‌ట‌న‌ను ఖండించిన హోం మంత్రి అనిత
నిందితుడ్ని అరెస్ట్ చేశామ‌న్న జిల్లా ఎస్పీ సుబ్బ‌రాయుడు

తిరుప‌తి – అభంశుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారిని ఓ దుర్మార్గుడు కర్కశంగా చిదిమేశాడు.
అప్పటిదాకా నవ్వుతూ ఆడుకుంటున్న ఆ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేశాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా వడమాటపేట మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడు తెలిపిన వివరాల ప్ర‌కారం ఏఎం పురం గ్రామానికి చెందిన సుశాంత్‌(22) తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఓ దుకాణంలో తినుబండారాలు కొనిచ్చి సమీప పొలంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. అనంతరం బాలికను చంపేసి పూడ్చిపెట్టాడు. రాత్రి బాగా పొద్దుపోయినా పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వడమాలపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంట‌నే రంగంలోకి దిగిన ఎస్సీ సుబ్బ‌రాయుడు విచార‌ణ‌ను వేగ‌వంతం చేశారు.. ఈ నేపథ్యంలో అనుమానితుడు సుశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

చంద్ర‌బాబు దిగ్బ్రాంతి –

తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడేళ్ల బాలికపై హత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం బాధిత కుటుంబానికి హోంమంత్రి అనిత ఇందుకు సంబంధించిన చెక్కును అందజేయనున్నారు.

ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి

తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మూడేళ్ల బాలికపై హత్యాచారం ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడటం హేయమన్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని అనిత తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement