అమరావతి – తెలంగాణ ముఖ్యమంత్రి,బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనాలని నిర్ణయించడం అక్కడ అధికార పార్టీ వైసిపికి మింగుడు పడటం లేదు.. స్టీల్ ప్లాంట్ చుట్టూ ఎపి రాజకీయాలు మొత్తం నడుస్తున్నాయి.. అలాగే కెటిఆర్ సైతం ప్రెస్ మీట్ ప్రభుత్వ రంగ స్థంస్థ మనుగడకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాంటూ చెప్పండంతో వైసిపి అలెర్ట్ అయింది.. ఆ వెంటనే సీన్లోకి వచ్చిన వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టారెడ్డి గతంలో జగన్ చెప్పిన విషయాన్నే కెటిఆర్ ప్రస్తావించారంటూ ఆ క్రెడిట్ జగన్ ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు..ఇక సింగరేణి బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ లో అడుగుపెట్టిన వెంటనే వైసిపి స్వరాన్ని మరింత పెంచింది.. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ బిఆర్ ఎస్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. స్టిల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనడం అంటే ప్రైవేటీకరణకు బిఆర్ ఎస్ జై కొట్టడమే నంటూ ఆ పార్టీని విమర్శించారు.. తాము మాత్రం విశాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని తేల్చి చెప్పారు..
అయితే రాజకీయ ఎంట్రీ కోసమే స్టిల్ ప్లాంట్ అంశాన్ని కెసిఆర్ భుజాన వేసుకున్నారని భావిస్తున్న వైసిపి ఇప్పడు డిఫెన్స్ వాదాన్ని తెరపైకి తెచ్చారు.. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, సిదిరి అప్పలరాజు, పార్టీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బిఆర్ ఎస్ తీవ్రపదజాలంతో విమర్శలకు పదును పెట్టారు.
ఎపిలో రోడ్లే సరిగా ఉండవన్న తెలంగాణ మంత్రి హారీష్ రావుపై కారుమూరి అగ్గిమీద గుగ్గిలమయ్యారు.. ఏపీకి రా మా రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూపిస్తామని మంత్రి కారుమూరి సవాలు విసిరారు.తమ రాష్ట్రం గురించి దౌర్భగ్యమైన మాటలు మాట్లాడకు అంటూ చురకలు అంటించారు. ధనిక రాష్ట్రాన్ని(తెలంగాణ) మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయి. మీ రాష్ట్రంలో స్కూళ్లు, మా రాష్ట్రంలో స్కూళ్ల తేడా చూసుకో. తెలంగానలో సంక్షేమ పథకాలు.. మా సంక్షేమ పథకాలకు తేడా చూడు. జీడీపీలో మేం దేశంలోనే నంబర్ వన్‌లో ఉన్నాం. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకో. ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ హారీష్ కు కౌంటర్ ఇచ్చారు.
ఇక మరో మంత్రి సిదిరి అప్పలరాజు కూడా బిఆర్ఎస్ పైనా, ఇక్కడి మంత్రులపైనా ఫైర్ అయ్యారు.. తెలంగాణలో విపక్షాల దాడికి తట్టుకోలేకే ఎపిపై పండారంటూ ఎత్తిపొడిచారు.. బిఆర్ఎస్ కు ఎపి ప్రజల బద్ద వ్యతిరేక పార్టీ అని, అ పార్టీకి ఇక్కడ చోటు లేదంటూ చెప్పేశారు.. అక్కడ అభివృద్ధి ముసుగులో అరాచకం కొనసాగుతుందంటూ కెసిఆర్ పాలనను దుమ్మెత్తి పోశారు..
ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న నవరత్నాలు సంక్షేమ పథకాలు తెలంగాణ మంత్రి హరీష్‌రావుకు కనబడటం లేదా అని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఎపి గురించి హరీష్‌రావు చెప్పడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ గురించి ఏం తెలుసని హరీష్‌రావు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఏపీలో సంక్షేమ పథకాలు హరీష్‌రావుకు కనబడటం లేదా అని నిలదీశారు. తెలంగాణలో ప్రతిపక్షాలను ఎదుర్కోలేక ఏపీ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అల్లుడు, కూతురు అందరూ కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. చినుకుపడితే హైదరాబాద్ రోడ్లపై పడవలో తిరగాల్సిన పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్‌ను బాగుచేసుకోలేని వారు తమ గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు.
మొన్నటి వరకు వైసిపి, బిఆర్ఎస్ సఖ్యతగా ఉన్నా స్టీల్ ప్లాంట్ వ్యవహారంతో ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు మాటల యద్ధం హై టెన్షన్ పుట్టిస్తున్నది.. వైసిపి తాజాగా అక్కడ ప్రతిపక్షపార్టీలు జనసేన,తెలుగుదేశంపై కంటే బిఆర్ ఎస్ పైనే దృష్టి సారించింది.. రానున్న రోజులలో వైసిపి స్వరం మరింత పెరగనుంది..