Saturday, June 29, 2024

AP – మూడు జిల్లాల్లో డ‌యేరియా … ఒకరి మృతి – 168 మంది ఆసుపత్రిపాలు

ఆంధ్రప్రభ స్మార్ట్, జగ్గయ్యపేట ప్రతినిధి:ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వాంతులు, విరోచనాలతో 54 మంది ఆసుపత్రిపాలు కావటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఉదయం హుటాహుటిన జగ్గయ్యపేటకు వచ్చారు. స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, అధికారంతో కలిసి పట్టణానికి ప్రధాన తాగునీరు అందించే హెడ్ వాటర్ వర్క్స్ ను మంత్రి పరిశీలించారు.

పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలం సందర్భంగా రాష్ట్రంలో డయేరియా కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 సీజనల్ కేసులు నమోదైనట్లు వివరించారు

- Advertisement -

కాకినాడ , గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో వాంతులు విరోచనాలతో పలువురు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. జగ్గయ్యపేటలో 58 మంది అనారోగ్యానికి గురయ్యారని వీరిలో 11 మంది చికిత్సతో కోలుకున్నట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనారోగ్యం పాలైన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం లభిస్తున్నట్లు వివరించారు.

శానిటేషన్ లోపమే అసలు సమస్య

జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ఎస్ఎంపేట, మక్కపేట గ్రామాలలో ప్రధానంగా తాగునీరు అందించే ట్యాంకులను శుభ్రపరచలేదని ఆరోపణలు వస్తున్నాయన్నారు.తాగునీటి పైప్ లైన్ లు డ్రెయినేజీలో కలవడంతో తాగునీరు కలుషితమవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వాటర్ పైపులైన్ల లీకేజీ కారణంగా సమస్య ఉత్పన్నమైనట్లు భావిస్తున్నట్లు తెలిపారు. గత ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు శానిటేషన్ సిబ్బందికి జీతాలు రాని పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయన్నారు. ప్రజల ఆరోగ్యానికి అనుబంధంగా ఉన్న మున్సిపల్, పంచాయతీరాజ్ , ఆరోగ్య శాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి అధికారులు ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ సేవలందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం.

.ప్రజలు కూడా వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ అన్నారు. సుమారు 30 వేల నమూనాలను ఆరోగ్య శాఖ సేకరించగా.. వీటిలో 217 నమూనాల్లో కలుషిత నీరు ఉన్నట్టు నివేదికలు వచ్చినట్లు తెలిపారు. ఒక యాక్షన్ ప్లాన్ ను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు వివరించారు ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతని ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఈ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. జగ్గయ్యపేట ప్రాంతంలో డయేరియా వ్యాధితో ఒకరు చనిపోయినట్లు తెలిపారు. మరొకరు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినట్లు సమాచారం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలోవైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కమిషనర్ కృష్ణబాబు, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మాజీ మంత్రి నెట్టెం రఘురాం పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement