Tuesday, November 19, 2024

అందుకే కొత్త పార్టీలు: తెలంగాణ రాజకీయాలపై ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్య

తెలంగాణ రాజకీయాలపై ఏపీ మంత్రి పేర్ని నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై ఏపీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకు వస్తున్నాయని మంత్రి పేర్ని నాని అన్నారు. అందుకే ఓ ఐపీఎస్ రాజీనామా చేసి మరీ పార్టీ పెట్టారని.. మరికొన్ని పార్టీలు కూడా వచ్చాయని అభిప్రాయపడ్డారు. ఏపీలో 151 స్థానాలు వచ్చిన తర్వాత శూన్యత ఎక్కడుందని? ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల గుండెల్లో ఎక్కడా శూన్యత లేదన్నారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట తప్పారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. డిండి-పాలమూరు ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు మళ్లించారని ఆరోపించారు. ఏపీకి కేటాయించిన నీటిలో అదనంగా చెంచాడు నీళ్లు కూడా వినియోగించబోమని ఎప్పుడో చెప్పామని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంతదూరమో.. విజయవాడ నుంచి హైదరాబాద్ అంతే దూరమని గమనించాలని మంత్రి పేర్ని నాని సూచించారు.  

ప్రతిరోజూ రాజకీయాల్లో ఉండాలనుకునేవారు అలాగే మాట్లాడతారని టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సెటైర్ వేశారు. రేవంత్‌కు రోజూ రాజకీయాలు కావాలి కాబట్టి ఏదేదో మాట్లాడతారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెట్టాలని కోరుతున్నారని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్నినాని గురువారం కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ పెట్టాలని మేమూ కోరుకుంటున్నాం. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు. ఏపీ, తెలంగాణ ఒకటే రాష్ట్రంగా ఉండాలని సీఎం జగన్ గతంలోనే కోరుకున్నారు. రెండు రాష్ట్రాలు కలిపేస్తే మంచిదే కదా’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: ప్రతి గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement