Thursday, November 21, 2024

మరో వివాదంలో ఏపీ మంత్రి.. ఎస్సైకి బెదిరింపులు!

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యే అనుచరుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన మరువక ముందే.. తాజాగా సాక్షాత్తూ ఏపీ మంత్రి కూడా ప్రభుత్వ అధికారికి బెదిరింపులకు పాల్పడడం దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాలో వైసీపీ నేతల హస్తముందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమ ఇసుక రవాణా వివాదంలో చిక్కుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను వదిలేయాలని ఓ ఎస్సైని బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఓ ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్థానిక పోలీసులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో రవాణా చేస్తున్న వ్యక్తులు మంత్రి జయరాంను ఆశ్రయించారు. దీంతో ఎస్సైకి ఫోన్ చేసిన జయరాం.. పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయాలని హుకుం జారీ చేశారు. పట్టుకున్న ట్రాక్టర్లను వదలకుంటే తానే ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. ”నాకు జనం ముఖ్యం… ఈసారి కూడా ఇక్కడ నేనే పోటీ చేసేది.. నేను గెలిస్తేనే ఇడ యవ్వారం అయ్యేది, నేను ధర్నాకు దిగాలా.. ట్రాక్టర్లను వదిలేస్తారా ? ” అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇసుక రవాణా చేస్తున్నట్లు ఎవరైనా చూస్తే పట్టుకోండి.. లేదంటే వదిలేయండన్నారు. ఈ ఆడియో లీక్ కావడంతో ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ ఆడియోతో వైసీపీ నేతల ఇసుక అక్రమ రవాణా నిజమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు తన పేరుతో వైరలైన వీడియోపై మంత్రి జయరాం స్పందించారు. తాను ఎవరినీ బెదిరించలేదని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు, జగనన్న కాలనీలకు.. ఇసుక తరలిస్తుంటే ఎస్సై అడ్డుకున్నారని బాధితులు తనతో చెప్పారని తెలిపారు. బాధితుల పరిస్థితి చూడలేకే ఆవేదనతో ఎస్సైతో అలా మాట్లాడాల్సి వచ్చిందని మంత్రి వివరణ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: వైసీపీ నేత మళ్లను అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement