Wednesday, January 22, 2025

AP – పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని మరింత పెంచుతాం – వంగలపూడి అనిత

ఎన్టీఆర్ బ్యూరో – ఆంధ్రప్రభ, చట్టానికి వ్యతిరేకంగా ఎవ్వరు తప్పు చేసిన, ఎంతటి వారైనా పోలీసు వ్యవస్థ నుండి తప్పించుకోలేరని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్న ఆమె ప్రజా భాగస్వామ్యంతో నేర రహిత సమాజ స్థాపనకు పని చేస్తున్నామన్నారు. ఇప్పటికే డ్రగ్స్ గంజాయి వంటి వాటిపై ఉక్కు పాదం మోపామని, సురక్షతో ప్రజలకు మరింత భద్రత పెరగనుందని పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని మరింత పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం జిల్లావ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 1000 సీసీ కెమెరాలు డిజిపి ద్వారకా తిరుమల రావు, ఎంపీ కేసినేని శివనాద్, కలసి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే స్టేషన్ల వారీగా ఏర్పాటుచేసిన సురక్ష కమిటీలను సైతం ఆమె ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అవగాహనతోనే సగం నేరాలను నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజల భాగస్వామ్యంతో నేరరహిత సమాజం దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని మరింత సురక్షితంగా భద్రతగా ఉంచే దిశలో సీసీ కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

భద్రత విషయంలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే సురక్ష లక్ష్యం అన్న మంత్రి అనిత, పోలీస్ గా పనిచేయడం చాలా పెద్ద బాధ్యత అని గుర్తు చేశారు. విజయవాడ ప్రజలకు కీలకమైన బెంజి సర్కిల్ ట్రాఫిక్ ను నియంత్రించగలిగాం మని, అతి ముఖ్యమైన ప్రదేశాలను హాట్స్పాట్లుగా గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీస్ వ్యవస్థ గర్వంగా గౌరవాన్ని స్వీకరించేలా పని చేస్తోందని, విజయవాడ వరదల నుంచి ప్రాణ నష్టంలేకుండా బయటపడడం పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం అనిర్వచనీయం అన్నారు.

లక్షల మంది దుర్గ భక్తులు వస్తున్నా అవాంతరం లేకుండా సీఎం మెచ్చుకునేలా పోలీసులు పని చేశారని తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని డ్రోన్, సీసీ కెమెరాలు వంద మంది పోలీసులతో సమానం గా గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపామని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేట్ కార్యక్రమాలన్నింటిలో టోల్ ఫ్రీ నంబర్లపై అవగాహన కలిగించే హోర్డింగ్లు, ఫ్లెక్సీ, బ్యానర్లకు ప్రజాప్రతినిధులు ప్రాధాన్యతనివ్వాలని మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.

నేరరహిత సమాజంకోసం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తీసుకున్న చర్యలకు అభినందనలు చెప్పిన మంత్రి, 35 ఏళ్లుగా సేవలందిస్తున్నా నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు చొరవకు ప్రత్యేకంగా అభినందించారు. బుడమేరు, భవానీ దీక్షల ఏర్పాట్లు సహా ప్రతి పనిలో ముందుండి నడిపిస్తున్న సిపి రాజశేఖర్ తో పాటు ట్రాఫిక్, క్రైమ్ డీసీపీలందరికీ అభినందనలు చెప్పిన మంత్రి అనిత ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులందరినీ ఏకతాటి పైకి ఎంపీ కేసినేని శివనాథ్ తీసుకువచ్చారని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement