Sunday, November 3, 2024

వైఎస్ పై నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు: తెలంగాణ నేతలకు ఏపీ మంత్రి హితవు

తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదంపై మాటల తూటాలు పేలుతున్నాయి. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందని, తెలంగాణ నీటిని ఏపీకి దోచుకెళ్లిన దొంగ, నరరూపరాక్షసుడు అంటూ తెలంగాణ మంత్రులు చేసిన తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ పై తెలంగాణ నేతల వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం సక్రమేనని తెలిపారు. ఆర్డీఎస్ పై తెలంగాణ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. రాష్ట్ర హక్కుగా రావాల్సిన నీటినే వాడుకుంటున్నామని అనిల్ స్పష్టం చేశారు. తాము అక్రమంగా ఎలాంటి ప్రాజెక్టును నిర్మించడంలేదన్నారు. తెలంగాణలో పాలమూరు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులు అక్రమంగా కట్టినవేనని ఆరోపించారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న నీటిపారుదల సమస్యను సామరస్యంగా పరిష్కరించరించేందుకు కృషి చేస్తున్న సమయంలోనే, తెలంగాణ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి అనిల్ పేర్కొన్నారు.

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తారని చెప్పారు. పోతిరెడ్డిపాడును వెడల్పు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ లో తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఏపిలోని అన్ని ప్రాంతాలకు నీరు చేరాలంటే తాము కూడా ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు సామార్థ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. తాము అక్రమంగా ఏ ప్రాజెక్టులూ నిర్మించడం లేదని అనిల్ పునరుద్ఘాటించారు. పాలమూరు డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులు కూడా అక్రమంగా కట్టారని, ఆనాడు టీడీపీ ప్రభుత్వం వాటిని అడ్డుకోలేకపోయిందని విమర్శించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement