Friday, October 18, 2024

AP – దుర్గగుడి అభివృద్ధికే తొలి ప్రాధాన్యత… ఎమ్మెల్యే సుజనా చౌదరి

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) – అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు, మాజీ కేంద్రమంత్రి ఎలమంచిలి సత్యనారాయణ(సుజనా చౌదరి) తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా శాశ్వత క్యూలైన్లను ఏర్పాటు చేసి, ఘాట్ రోడ్డు వద్ద రెండు మార్గాల ఏర్పాటులకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేశామన్న ఆయన చిన్న చిన్న లోటుపాట్లు గుర్తించామని వాటిని త్వరలోనే అధిగమిస్తామని తెలిపారు. విఐపి ప్రోటోకాల్ దర్శిలను కట్టడి చేయడంతో సామాన్య భక్తులకు అమ్మవారి శీఘ్ర దర్శనం లభించింది అన్నారు.

విజయవాడలోని ఆదివారం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాలను అందరూ సంతోషంగా చేసుకున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి దసరా ఇది అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గా ఇంద్రకీలాద్రి పై తన వంతు కర్తవ్యం తాను నిర్వర్తించానని, సీపీ, కలెక్టర్, ఈఒ సమన్వయం తో ఉత్సవాలు విజయవంతం చేయడం అభినందనీయం అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా ప్రతి రోజు ఏర్పాట్లు పరిశీలీంచి చర్యలు తీసుకున్నారని, చిన్న చిన్న సమస్యలు తప్ప.. ఉత్సవాలు బాగా విజయవంతంగా జరగడం ఆనందంగా ఉందన్నారు.

- Advertisement -

కొన్ని లోపాలను గుర్తించామాని,…‌ వచ్చే యేడాది వాటిని పునరావృతం కాకుండా సరి చేస్తాం అని ప్రకటించారు. తాత్కాలిక ఏర్పాట్లు ప్రతి యేడాది చేసి మళ్లీ తొలగిస్తున్నారని, ఈసారి పర్మినెంట్ క్యూ లైన్ల తో పాటు కొన్ని శాశ్వత ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం అన్నారు. కొండ పైకి అనవసర వాహనాలు కూడా ఆపడం వల్ల ఇబ్బందులు తొలగించాం అన్న అయన సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం సూచనలు కూడా ఈ ఉత్సవాల విజయవంతం గా నిర్వహించేందుకు తోడ్పాడ్డాయని అన్నారు.

ఒకవైపు కొండ పైకి, మరో వైపు నుంచి కిందకి దిగే లా మార్గాలు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం అని, వచ్చే దసరా నాటికి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. సామాన్య భక్తులు ప్రశాంతంగా ఈసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నారని, ఎక్కడా ఎటువంటి గందరగోళం కొండ పై లేకుండా ఈ యేడాది ఉత్సవాలు ఘనంగా ముగిశాయని ప్రకటించారు.

అధికారులు, పాలకులు కూడా సమన్వయం తో పని చేశారని, వీఐపీ, వివిఐపి లకు స్లాట్ లు ఇచ్చి ఒక ప్రత్యేక సమయం కేటాయించడంతో భక్తులు రద్దీ ఉన్నా సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూసామన్నారు. దుర్గగుడి అభివృద్ధి కి ఆ ప్రాంత ఎమ్మెల్యే గా తన వంతు కృషి చేస్తానని, సూచనలు, సలహాలు , అభిప్రాయాలను రాసి నాకు అందిస్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం అనే సుజనా చౌదరి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement