Friday, November 22, 2024

AP: అల్పడీనం ఎఫెక్ట్.. ఏపీ తీర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక

నెల్లూరు, (ప్రభ న్యూస్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీనం ప్రభావంతో గత వారం రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా అల్లూరులో 378.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా , అత్యల్పంగా సీతారామపురం మండలంలో 59 మి. మీ నమోదైంది. అయితే ఆదివారం మాత్రం సూళ్లూరుపేటలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో జలవనరులు పొంగి పొర్లాయి . పుచ్చల కాలువలో ప్రమాదవశాత్తు ఎద్దుల బండి వెళ్లడంతో నీటిధాటికి తట్టుకోలేక కొట్టుకుపోయింది. దీంతో రెండు ఎద్దులు మృతిచెందాయి. ముఖ్యంగా జిల్లాకు తూర్పున ఉన్న మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా , మెట్ట ప్రాంతాలుగా పేరు పొందిన సీతారామపురం , వరికుంటపాడు, దుత్తలూరు ,ఉదయగిరి , డక్కిలి, మర్రిపాడు , కొండాపురం మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్ర‌కారం పశ్చిమ మధ్య బంగాళా ఖాతం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళా ఖాతం దగ్గరలోని దక్షిణ ఆంధ్ర -ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతం మీద ఉపరితల ఆవర్తనం ఉన్నది. ఇది సగటు- సముద్ర మట్టము నకు 4 .5 కి.మీ.ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఆగ్నేయ బంగాళా ఖాతం మరియు దాని దగ్గర ఉన్నభూమధ్య రేఖ వద్ద ఉన్న హిందూ మహా సముద్రము -సుమత్రా తీర ప్రాంతాల మీద ఉన్నఉపరితల ఆవర్తనం సగటు- సముద్ర మట్టము నకు 4.5 కి.మీ.ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావం తో ఆగ్నేయ బంగాళా ఖాతం మరియు దాని దగ్గర ఉన్న ప్రాంతాల మీద సుమారు నవంబర్‌ 9 వ తేదీ న అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మరింత బల పడి రాగల 48 గంటలలో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరం వైపుకు ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ఫలితంగాఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.

నెల్లూరు జిల్లాకు విశేషమైన తీర ప్రాంతం ఉంది . దాదాపు 12 మండలాలు సరిహద్దును కలిగి ఉన్నాయి . వేలాది మంది మత్స్యకారులు సముద్రపు వేట ఆధారంగా జీవిస్తున్నారు. రాష్ట్ర వాతావరణ శాఖ , జిల్లా అధికార యంత్రాంగం సూచనల మేరకు ఆయా మండలాల తహసీల్దార్లు , ఎంపీడీవోలు , సంబంధిత ప్రాంతాల ఎస్సైలు తీర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో జిల్లా వ్యాప్తంగా సహాయ చర్యలకు కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం అధికార యంత్రాంగం సిద్ధమైంది .

Advertisement

తాజా వార్తలు

Advertisement