ముప్పేట దాడికి యత్నించిన వైసీపీ
ఎదురుదాడికి దిగిన మంత్రి కొల్లు రవీంద్ర
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల చిట్టా బయటికి
మద్యం పాలసీని తప్పుపట్టిన ఎమ్మెల్సీ దువ్వాడ
ఇతర రాష్ట్రాలకంటే బెటర్ అన్న కొల్లు రవీంద్ర
అప్పడన్నీ లోకల్ బ్రాండ్సే ఇచ్చారు
ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తెచ్చాం
కల్లు గీత కార్మికులకు 10శాతం షాపులు కేటాయించాం
జగన్ సర్కారు హయాంలో మొత్తం లిక్విడ్ క్యాష్ పేమెంట్స్
ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందన్న మంత్రి
విజిలెన్స్, ఏసీబీ సంస్థలతో పూర్తిస్థాయి దర్యాప్తు..
అసలు సూత్రధారులు ఎవరో దొరుకుతారని వెల్లడి
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ: ఏపీ రాజకీయాలకు శాసన మండలి వేదికైంది. మండలిలో వైసీపీ సభ్యులు అధికంగా ఉండడంతో ప్రభుత్వంపై ముప్పేట దాడి మొదలుపెట్టే ప్రయత్నం చేశారు. లేటెస్ట్గా కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొన్నిన మద్యం పాలసీపై సభలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. శుక్రవారం మండలి సమావేశాలు ప్రారంభం కాగానే ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ గురించి మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. మిగతా రాష్ట్రాలతో ధరలను పోల్చిన తర్వాతే తక్కువ ధరకే మద్యం ఇస్తున్నామన్నారు.
మండలి చైర్మన్ జోక్యం..
మంత్రి కొల్లు సమాచారంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో షాపులను కుదించి, ప్రభుత్వమే అమ్మకాలు సాగించిందన్నారు. ఆ విధానాన్ని మార్చి, మళ్లీ షాపులను పెంచి టెండర్లు ఇచ్చారని మండిపడ్డారు. షాపుల కేటాయింపులో రౌడీయిజం జరిగిందన్నారు. ఇదేనా నూతన మద్యం విధానమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ గందరగోళం మధ్యలో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు జోక్యం చేసుకున్నారు. పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ఇక్కడ ప్రామాణికం కాదన్నారు. మద్యం పాలసీపై దువ్వాడకు ఇవ్వాళ గుర్తుకు వచ్చిందా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. వైసీపీ హయాంలో షాపులను పెంచారని, కూటమి ప్రభుత్వం ఏమాత్రం పెంచలేదన్నారు.
అప్పుడన్నీ లోకల్ బ్రాండ్సే కదా..
10 శాతం కల్లుగీత కార్మికులకు మద్యం షాపులు ఇవ్వడం తప్పా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఎదురుదాడి మొదలుపెట్టారు. ఆనాడు వైసీపీ హయాంలో రేట్లు విపరీతంగా పెంచారన్నారు. 20డిస్టలరీస్కు సంబంధించి 60శాతం వాటా బలవంతంగా తీసుకున్నారని మంత్రి మండిపడ్డారు.
అంతర్జాతీయ బ్రాండ్లను తీసుకురాకుండా లోకల్ బ్రాండ్స్ తీసుకొచ్చారని విమర్శించారు. అంతేకాకుండా ఎక్సైజ్ డిపార్టుమెంట్ మొత్తాన్ని వైసీపీ నాశనం చేసిందని గుర్తు చేశారు.
ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్లింది..
ఓన్లీ క్యాష్ రూపంలో నగదు తీసుకున్నారని, ఆ మనీ ఎక్కడికి వెళ్లిందని మంత్రి కొల్లు ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో మద్యం తక్కువగానే ఉంటుందన్నారు. మద్యం పేరిట వైసీపీ దోపిడీకి పాల్పడిందని మంత్రి కొల్లు రవీంద్ర ఎదురుదాడి చేశారు. తాము అలా కాకుండా ప్రజలు కోరుకునే అంతర్జాతీయ బ్రాండ్లను తీసుకొచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ అవకతవకలపై విజిలెన్స్ విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఏసీబీ కూడా దర్యాప్తు చేస్తోందని, ప్రధాన సూత్రధారులు బయటకు వస్తారన్నారు. బెల్ట్ షాపులకు శ్రీకారం చుట్టింది వైసీపీ సర్కార్ అని మంత్రి సీరియస్ అయ్యారు.