అమరావతి – అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ పక్కనే ఉన్న కొండపాకలూరు గార్డెన్స్‌లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో గురువారం అర్ధరాత్రి ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మారయ్యబాబు, సూర్యనారాయణ నేతృత్వంలో సీఐలు వీరాంజనేయులు, నయనతార, రమేష్‌తోపాటు 20 మంది సిబ్బంది తనిఖీలు చేశారు. సచివాలయ ఉద్యోగుల నాయకుడు వెంకట్రామిరెడ్డి ఈ పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించి అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
డిసెంబరు 4న సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికల నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎక్సైజ్ శాఖ నుంచి ఎటువంటి అనుమతీ తీసుకోకుండా పార్టీ నిర్వహించి, నిబంధనలను అతిక్రమించినట్లు నిర్వాహకుడు వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి ఏడు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.