Sunday, November 24, 2024

AP – డోన్‌ సకలాభివృద్ధికి తోడ్పడండి – సిఎంకు కొట్ల వినతి

కర్నూల్ బ్యూరో డోన్‌ . డోన్‌ నియోజకవర్గం అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సహకారం అందించాలని ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఆయన అమరావతిలోని సచివాలయంలో డోన్‌ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను అందజేశారు.

ప్రధానంగా డోన్‌ నియోజకవర్గం నుంచి నంద్యాల, పత్తికొండ, కోడుమూరు పట్టణాల వైపు రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తూ అన్ని ప్రధాన గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇటీవల గ్రామ పంచాయితీలకు నిధులను కేటాయించి వాటి అభివృద్ధికి తోడ్పడినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక నియోజకవర్గంలోని డోన్‌, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లోని గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా తాగునీటి సమస్య ఉందని ఆయన సీఎం దృష్టికి తీసుకుపోయారు. ఇందుకు గాజులదిప్నె, గోరుకల్లు జలాశయాలతో హంద్రీ`నీవా కాలువ నుంచి నీటిని తరలించేందుకు అవరసమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

గాజులదిన్నె నుంచి 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి పైపు లైను నేటి ప్రజావసరాలకు సరిపోవడం లేదని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకుపోయారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గోరుకల్లు జలాశయం నుంచి బేతంచెర్లకు తాగునీటి పంపిణీ చేసే పథకంలోని లోపాలను సరిదిద్ధి ప్రజావసరాలకు తగిన విధంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కోరారు.

- Advertisement -

ఇక ప్యాపిలి మండలానికి గాజులదిన్నె, హంద్రీ`నీవా కాలువ ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి కోరారు.

ఇక రైతులు పంట సాగు కోసం హంద్రీనీవా నుంచి నియోజకవర్గంలోని పలు చెరువులకు నీటిని తరలించేందుకు ఉన్న ప్రతిపాదనలను వేగంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీని కారణంగా రైతులు నష్టాలకు గురికాకుండా ఉంటారని ఆయన సూచించారు. నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేయాలని కోట్ల సూచించారు.

ఐటీ రంగంలో విశేష అభివృద్ధి సాధించిన హైదరాబాదు, బెంగుళూరు నగరాలకు మధ్యలో డోన్‌ పట్టణం ఉందని గుర్తు చేశారు. డోన్‌ పట్టణం కర్నూలు విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండటంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సాగుకు పనికి రాని ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు.

ఈ భూమిలో పారిశ్రామిక, ఐటీ సంస్థలను ఏర్పాటు చేస్తే వెనుకబడిన కర్నూలు, అనంతపురం జిల్లాల యువతకు ఉపాధిని కల్పించవచ్చని కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డికి తెలిపారు.

ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ అత్యంత ప్రధానమైన తాగు, సాగు నీటి పథకాల విషయంలో తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డోన్‌ పట్టణంలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న వనరులను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేస్తానని వెల్లడిరచారు.

గ్రామీణాభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా నిధులను కేటాయిస్తోందని వాటితో రహదారుల నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. వరద బాధితుల సహాయం కోసం రూ.32లక్షలువిజయవాడ వరదబాధితుల కోసం డోన్‌ నియోజకవర్గ ప్రజల నుంచి సేకరించిన రూ.32లక్షల నిధులకు సంబంధించిన చెక్కును చంద్రబాబు కు అందజేశారు.

వరదల సమయంలో రూ.12లక్షల విలువైన నిత్యావసర వస్తువులను డోన్‌, బేతంచెర్ల, ప్యాపిలి మండల నాయకులు విజయవాడకు తీసుకువచ్చి ప్రజలకు పంపిణీ చేశారని కోట్ల సీఎంకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఆల్బమ్‌ కూడా ఆయన అందజేశారు.

ఈ కార్యక్రమంలో డోన్‌ నియోజకవర్గ సీనియర్‌ నేత లక్కసాగరం లక్ష్మిరెడ్డి, యువనేత కోట్ల రాఘవేంద్రా రెడ్డి, న్యాయవాది శ్రీనివాస భట్టు తదితరలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement