తప్పుడు కేసు బనాయించారన్న జత్వానీ
ముంబయిలో కేసు ఎత్తివేయాలని బెదిరించారు
నా దగ్గరున్న ఆధారాలన్నీ గుంజుకున్నారు
ఫోర్జరీ పత్రాలను సృష్టించారు
10 ఎలక్ట్రానిక్ పరికరాలు ఇప్పటికీ ఇవ్వలేదు
ముగ్గురు ఐపీఎస్ అధికారులపై నటి కాదాంబరి ఫిర్యాదు
విజయవాడ పోలీసు అధికారులకు ఆధారాల అందజేత
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ: తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసి వేధించిన వ్యవహారంలో అప్పటి సీపీ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు కీలక వ్యక్తులని బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె గురువారం రాత్రి విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. దర్యాప్తు అధికారి ఏసీపీ స్రవంతి రాయ్‌ను కలసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై కేసు పెట్టి, తన తల్లిదండ్రులను అరెస్టు చేశారని వాపోయారు. విద్యాసాగర్‌తో పోలీసు ఉన్నతాధికారులు కుమ్మక్కై ఫోర్జరీ పత్రం సృష్టించి తప్పుడు కేసు నమోదు చేశారని కాదంబరి పేర్కొన్నారు.
ఆ కేసు వెనక్కి తీసుకోవాలనే..
పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకే ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కేసు నమోదు చేశారని జత్వానీ చెప్పారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగ మేఘాలపై ముంబయి వచ్చి తనతో పాటు తల్లిదండ్రులనూ అరెస్టు చేయడం కుట్రలో భాగమే అన్నారు. పోలీసు కస్టడీలో తనను ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు సుదీర్ఘంగా విచారించారనీ, ముంబయిలో కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారని ఆరోపించారు. విద్యాసాగర్‌ను వెంటనే అరెస్టు చేసి, తనకు, తన కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు.
నా ఆధారాలన్నీ సీజ్ చేశారు
కమిషనర్ కార్యాలయం వెలుపల కాదంబరి మీడియాతో మాట్లాడారు ‘17 క్రిమినల్ కేసులు ఉన్న కుక్కల విద్యాసాగర్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అటువంటి వ్యక్తి నాపై ఆరోపణలు చేయడం తగదు. నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేసి పబ్బం గడుపుకోవాలని విద్యాసాగర్ చూస్తున్నారు. ఇటువంటి దారుణ పరిస్థితుల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని కోరుకుంటున్నా. దీనికి రాజకీయ రంగు పులమడం అన్యాయం. కొందరు పోలీసు ఉన్నతాధికారులు పరిధి దాటి వ్యవహరించడంతో వారిపై ఫిర్యాదు ఇచ్చా. పోలీసు కమిషనర్ త్వరితగతిన కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. నన్ను అరెస్టు చేసిన సమయంలో 10 ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు సీజ్ చేశారు. వాటిలో చాలా ఆధారాలున్నాయి. ఇంత వరకు వాటిని తిరిగి ఇవ్వలేదు’ అని కాదంబరి జత్వానీ చెప్పారు.