వెలగపూడి – డిప్యూటీ సీఎం అంశం ఏపీ రాజకీయల్లో కలకలం రేపుతోంది. కూటమి ప్రభుత్వ పాలన ప్రశాంతంగా కొనసాగుతున్న తరుణంలో నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కొందరు టీడీపీ నేతలు చేసిన డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. ఈ డిమాండ్ లేవనెత్తుతున్న టీడీపీ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో జనసేన నేతలు కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు. లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు కోరుకోవడంలో తప్పు లేదని… తమకు కూడా పవన్ ను సీఎంగా చూడాలని ఉందని వారు కౌంటర్ అటాక్ ఇచ్చారు.
మరోవైపు ఇదే అంశంపై జనసేన కేంద్ర కార్యాలయం కూడా స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నేతలు, కార్యకర్తలు బహిరంగంగా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశాలు జారీ చేసింది. నాయకుల ఆకాంక్షలను తప్పుగా ప్రచారం చేస్తూ వైసీపీ కూటమిలో చిచ్చురేపాలనే కుట్రలకు పాాల్పడుతుందనే అనుమానంతో డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నాయకులెవరూ మాట్లాడవద్దని అధిష్టానం ఆదేశించింది. ఎవరైనా పరిధి దాటితే చర్యలు తప్పవని హెచ్చరించింది.