జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కీలక సూచనలు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో సమావేశమైన ఆయన పలు అంశాలపై చర్చించారు. జమిలీ ఎన్నికలు అంటున్నారని, పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని కమిటీలు పూర్తి స్థాయిలో పని చేయాలని సూచించారు. ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదని, సమస్యలపై పోరాటాలు చేయాలని చెప్పారు. అన్యాయాలపై ధర్నాలు, నిరసనలు తెలిపాలని, బాధితులకు అండగా నిలవాలని తెలిపారు. అలా చేస్తేనే ప్రజల్లో ఉధృతమైన స్పందన వస్తుందన్నారు. కష్టపడిన వారికి పార్టీలో అవకాశాలు లభిస్తాయని జగన్ పేర్కొన్నారు.
నియోజకవర్గాల వారీగా త్వరలో సమీక్షలు నిర్వహిస్తామని, ఇంచార్జుల పని తీరు మెరుగుపర్చుకోవాలని, చురుగ్గా పని చేసిన వాళ్లకు రేటింగ్స్ ఇస్తామని పార్టీ నేతలకు జగన్ సూచించారు. పూర్తి స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను నియమించామని, త్వరలో మరికొన్ని నియోజకవర్గాలకు ఉంటాయని పేర్కొన్నారు. బూత్ లెవర్ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు.