Tuesday, November 26, 2024

AP- మంచే చేశా … కానీ ఆప్యాయ‌త చూప‌లేదుః ఓట‌మిపై జ‌గ‌న్ నిర్వేదం

ఈ ఫలితాలను తాను అస్సలు ఊహించలేదన్నారు వైసిపి అధినేత జ‌గ‌న్. తాడేప‌ల్లిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజల తీర్పు చూసి చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రజలకు సంక్షేమాన్ని అందించి, మంచి చేసినా ఏమైందో తెలియడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు ఎంతో చేయాలని తాపత్రయ పడ్డానని, ఎన్ని మంచి పనులు చేసినా ఆ ఆప్యాయత ఎక్కడా కనిపించలేదన్నారు. అరకోటి మంది రైతుల ప్రేమ ఏమైందో, అక్కచెల్లెమ్మల ఓట్లెమయ్యాయో, అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో, కోట్లాదిమంది ప్రజల ప్రేమానురాగాలు ఏమయ్యాయో తెలియడం లేదంటూ విచారం వ్యక్తం చేశారు.


నేతన్నలు, మత్స్యకారులకు ఎంతో మంచి చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం రాకముందు ఇచ్చిన చాలీచాలని పెన్షన్ ను పెంచడంతో పాటు ఎన్నో సంక్షేమాలు అందించామని, విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశామని జగన్ తెలిపారు. రైతులకు ఉచితంగా విద్యుత్ అందించాం. మహిళలకు సంక్షేమ ఫలాలను అందించాం. 26 లక్షల అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులకు గతంలో ఎవ్వరూ చేయని మంచి చేశాం. సామాజిక న్యాయం చేసి చూపించాం. ఎంత చేసినా వాటి ఫలితం ఎన్నికల ఫలితాల్లో కనిపించలేదని జగన్ అసంతృప్తి చెందారు.

- Advertisement -

“ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేను చేయగలిగింది ఏమీ లేదు. పెద్ద పెద్ద వాళ్ల కూటమి ఇది. ఢిల్లీని శాసించే కూటమి ఇది. కూటమిలో చంద్రబాబు, పవన్, బీజేపీకి అభినందనలు.” అని తెలిపారు జగన్. ఏం చేసినా ఎంత చేసినా వైసీపీకి 40 శాతం ఓటింగ్ ను తగ్గించలేకపోయారన్నారు. ఏదేమైనా ప్రతి కష్టంలో తోడుగా ఉన్న నాయకుడు, ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉండటం కొత్తకాదు.. పోరాటం కొత్తకాదు. మంచి చేయడానికి ప్రజలకు తోడుగా ఉంటాం. గుండె ధైర్యంతో ముందడుగు వేస్తాం. అని జగన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement