Saturday, September 14, 2024

AP – బిరియాని అంటే ఆశ‌ పడ్డారు….. ఇప్పుడు ప‌స్తులుంటున్నారు…

చంద్ర‌బాబుపై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు
మోసంతోనే కూట‌మి గెలిచింది
ఒక్క హామీ కూడా అమ‌లు చేయ‌డం లేదు
ప్ర‌స్తుతం ఎపిలో రెడ్ బుక్ పాల‌నే
తాను అధికారంలో ఉంటే అన్ని ప‌థ‌కాలు అమ‌లు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని, కానీ చివరకు మోసం చేస్తున్నారని విమర్శించారు వైసిపి అధినేత , మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ . రాష్ట్రం ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నా అప్పట్లో తన ప్రభుత్వం సాకులు చూపలేదని, మాట తప్పుకుండా మేనిఫెస్టోని అమలు చేశామని పేర్కొన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లా భావించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేశామన్నారు.

- Advertisement -

మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో నేడు తాడేప‌ల్లి త‌న నివాసంలో జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే శ్రీరామ రక్ష అని నమ్మామని అన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయని వ్యాఖ్యానించారు. తాను పలావు ఇచ్చానని.. బాగానే చూసుకున్నాననని ప్రజలు అంటున్నారన్నారని పేర్కొన్నారు.

బిర్యానీ పెడతానన్న చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మిన ప్ర‌జ‌లు ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. తాను ఉండి ఉంటే.. రైతు భరోసా అందేదన్నారు. స్కూళ్లకు వెళ్తున్న ప్రతి పిల్లాడి తల్లులకు అమ్మ ఒడి అందేదన్నారు. సున్నా వడ్డీ కూడా వచ్చి ఉండేదన్నారు. విద్యాదీవెన కింద ఫీజురియింబర్స్‌‌మెంట్‌, వసతి దీవెన వచ్చేదన్నారు. మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా వచ్చి ఉండేదన్నారు. ఇంటికే వచ్చి పథకాలు అందించే పరిస్థితి పోయిందన్నారు. జన్మభూమి కమిటీల చుట్టూ, తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారని.. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో కూడా మోసం కనిపిస్తోందన్నారు.

ఆరోగ్య శ్రీ కింద ఒక్క పైసా ఇవ్వడం లేదని, ఇప్పటికే రూ.1600 కోట్ల బకాయిలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ కూడా పూర్తిగా దిగజారిపోయిందన్నారు. ప్రస్తుతం రెడ్‌ బుక్‌ పాలన నడుస్తోందన్నారు. కక్షలు తీర్చుకునేవారిని పోత్సహించేలా చంద్రబాబు తీరు ఉందన్నారు. ఈ మోసాలను చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోందన్నారు. మళ్లీ మన పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుందని జగన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement