Tuesday, November 19, 2024

AP – ప్ర‌శ్నిస్తే అరెస్ట్ లా …. చంద్ర‌బాబుపై జ‌గ‌న్ గ‌రం గ‌రం

అమ‌రావ‌తి – విద్య వద్దు.. మద్యం ముద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై కూడా పోలీసులు ఇష్టారీతిన కేసులు నమోదు చేస్తున్నారని ఫైర్ అయ్యారు వైసిపి అధినేత జగన్ . ప్రశ్నిస్తే తమ నేతలపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో కూటమి పాలనలో అంతా చీకటి రోజులేనంటూ ఆరోపించారు..

సోషల్ మీడియా వారియర్స్ ను అరెస్ట్ చేసిన సమయంలో 41ఏ నోటీస్ ను జారీ చేయాలని, అర్ధరాత్రి వెళ్లి ఎలా అరెస్టుల పర్వానికి తెర తీశారని ప్రశ్నించారు. ఏడేళ్ల లోబడి శిక్షలు ఖరారయ్యే కేసులకు నోటీసులను జారీ చేయాలన్న విషయం కూడా తెలియకుండా అక్రమ అరెస్ట్ లకు పాల్పడుతున్నట్లు జగన్ విమర్శించారు. ఈ అరెస్ట్ ల సమయంలో వారి కుటుంబాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, టీడీపీ సానుభూతిపరులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. నేరుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు ఒత్తిడి తెచ్చి డీజీపీ ద్వారా అక్రమ కేసులకు తెర తీశారన్నారు.

ఏపీలో లా అండ్ ఆర్డర్ దిగజారి పోయిందని, కేవలం 5 నెలల్లో 91 మంది మహిళలపై అత్యాచార యత్నాలు, ఘటనలు జరిగాయని, ప్రభుత్వం ఏం చేస్తుందంటూ జగన్ ప్రశ్నించారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అత్యాచార ఘటన జరిగినా కూడా నిందితులను పట్టుకోవడంలో పోలీసుల అలసత్వం ఉందన్నారు. ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, కానీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను గాలికి వదిలి ఏకంగా సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిపై మీ సత్తా చూపిస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైద్యశాలల్లో మందులు లేవు, సూపర్ సిక్స్ లు లేవు, సూపర్ సెవెన్ లు లేవని, అబద్దపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

తల్లిని చంపడానికి తాను ప్రయత్నించినట్లు టీడీపీ సోషల్ మీడియా కోడై కూసిందని, ఏకంగా తన తల్లి విజయమ్మ రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకొనే స్థాయికి తీసుకువచ్చారన్నారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ టీడీపీ సోషల్ మీడియాపై కేసు నమోదు చేసి, లోకేష్ ను డీజీపీ అరెస్ట్ చేయాలన్నారు. అయ్యా డీజీపీ గారూ.. సెల్యూట్ కొట్టాల్సింది మూడు సింహాలకు గానీ, అక్రమ కేసులు పెట్టించే వారికి కాదన్నారు. పోలీసుల అఘాయిత్యాలు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వం ఈరోజు మారి ఉండవచ్చు, రేపు మేము అధికారంలోకి వస్తాం.. చట్టాన్ని రక్షించండి కానీ, ఇలా అక్రమ కేసులు బనాయించి పోలీస్ ప్రతిష్టను దిగజార్చావద్దంటూ జగన్ కోరారు.

- Advertisement -

అసెంబ్లీకి తమకు రావాలని ఉన్నా… స్పీకర్ తమకు మైక్ ఇవ్వరని జగన్ ఆరోపించారు.. దీనికోసం ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు.. చంద్రబాబుని, కూటమి ప్రభుత్వాన్ని మీడియా సమక్షంలోనే ప్రశ్నిస్తానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement