Tuesday, November 26, 2024

Delhi | ఏపీ ఐటీ ఎగుమతులు రూ.925 కోట్లు.. రాజ్యసభలో కేంద్రమంత్రి వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : 2021-22లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.926 కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విశాఖపట్నం ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలపై రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బుధవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానమిచ్చారు. భారతదేశం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల్లో ఇది కేవలం 0.14 శాతం మాత్రమేనన్నారు. గత ఐదేళ్లలో ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా 0.2శాతం కంటే తక్కువగానే ఉందని ఆయన స్పష్టం చేశారు.

నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలు, భారీ ఉత్పాదక స్థావరాలు, ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ప్రతిభావంతులైన యువత, వ్యాపార అనుకూల వాతావరణం ఉన్నాయని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఐటీసీ స్టార్టప్‌ల కోసం టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టైడ్) 2.0” అనే పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఇంక్యుబేషన్ సెంటర్లు పని చేస్తున్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు. వీటిలో విశాఖపట్నంలో రెండు, తిరుపతి, గుంటూరు, చిత్తూరులో ఒక్కొక్కటి పని చేస్తున్నాయని జవాబులో పేర్కొన్నారు.

విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ), ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (ఎపీఐఎస్) సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించాయని, పూర్తి స్థాయి ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు సరైన స్థలం చూపించలేదని కేంద్ర మంత్రి చెప్పారు. ఆంధ్రా యూనివర్శిటీలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎస్‌టీపీఐ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ఎస్‌టీపీఐకి ఎకరం భూమిని అందించేందుకు ఆంధ్రా యూనివర్సిటీ జనవరి 2023లో అంగీకారం తెలిపిందని ఆయన తెలిపారు. దేశంలో ఐటీ మానవ వనరుల్లో రాష్ట్ర వాటా 10 శాతం ఉందని, వైసీపీ ప్రభుత్వం సరైన రీతిలో కృషి చేయకపోవడం వల్ల యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని జీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement