Tuesday, November 26, 2024

AP | మూడు రోజుల్లోనే హింసాత్మక ప్రదేశ్ గా మారింది – జగన్

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది.. కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు అని వాపోయారు. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకుని.. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై స్పందించాలని కోరారు.

‘‘రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. ఈ ఘ‌ట‌న‌ల‌పై రాష్ట్ర‌ గౌరవ గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను’’ అని ట్విట్టర్‌లో జగన్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement