Friday, November 22, 2024

దేశంలో టాప్‌ 10 నగరాల్లో ఏపీ.. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ సర్వేలో వెల్లడి

అమరావతి, ఆంధ్రప్రభ: దేశం మొత్తం మీద నివాసానికి సౌకర్యవంతంగా ఉండే పట్టణాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు నగరాలు టాప్‌-10లో నిలిచాయి. గుంటూరు ఆరో స్థానం, విజయవాడ ఎనమిదో స్థానం, విశాఖపట్నం తొమ్మిదో స్థానంలో నిలిచాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ఇటీవలే సిటిజన్‌ పర్సెప్షన్‌ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేద్వారా సేకరించారు. గుంటూరు నుంచి 3,32,620 మంది సర్వేలో పాల్గొన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో జాతీయస్థాయిలో 6వ ర్యాంకు ఈ నగరానికి లభించింది. విజయవాడ నుంచి 3.32 లక్షల మంది, విశాఖపట్నం నుంచి 2.88 లక్షల మంది సర్వేలో తమ అభిప్రాయాలను తెలియజేశారు.

గుంటూరు నుంచి 51.37 శాతం మంది ప్రజలు సర్వేలో పాల్గొనడం కూడా ఈ నగరానికి కలిసివచ్చి ఆరో ర్యాంకు సాధించింది. విజయవాడ నుంచి 32.12 శాతం, విశాఖపట్నం నుంచి 16.72 శాతం చొప్పున ప్రజలు సర్వేలో భాగమయ్యారు. ఈ ర్యాంకుల్లో మహారాష్ట్రలోని థానే, కర్ణాటకలోని బెంగళూరు, మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అటు- పింప్రి చించ్వాడ్‌, మిరా, నవీ ముంబై, కల్యాన్‌ డోంబివాలి టాప్‌ 10లో నిలిచిన ఇతర పట్టణాలు. గుంటూరు మెరుగైన ర్యాంకును సాధించేందుకు అక్కడి మున్సిపల్‌ అధికార యంత్రాంగం ముందు నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టింది.

- Advertisement -

ప్రజల్లో సర్వే పట్ల అవగాహన కల్పించి ఎక్కువ మంది పాల్గొనేలా చేయడంతో పాటు గుంటూరు మెరుగైన స్థానంలో నిలిస్తే అభివృద్ధికి నిధులు వస్తాయనే ప్రణాళికతో అధికారులు వ్యవహరించారు. ఈ ర్యాంకులు సాధించడంపై మూడు నగరాలకు చెందిన అధికారులను మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్మెంట్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సాధించిన మరో ఘనవిజయంగా దీన్ని అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement