Friday, November 22, 2024

AP: ఇరిగేషన్ ల్యాండ్స్ ఈజీగా కబ్జా చేస్తున్నారు..

అమరావతి, (ప్రభ న్యూస్‌): నీటిపారుదల శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లో, పంటకాల్వల భూముల్లో కబ్జాసురులు కాసులు పండిస్తున్నారు. ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని కాజేస్తున్నారు. జలవనరుల శాఖ జడత్వంతో ప్రభుత్వం పెద్దఎత్తున ఆదాయాన్ని, ఆస్తులను కోల్పోతోంది. నెల్లూరులో 50 కోట్ల విలువైన 2 ఎకరాల్లో కబ్జాలు, దందాలు సాగిపోతున్నాయి. ఆ తరహాలో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఆక్రమణలు, కబ్జాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తుంటే.. మరోవైపు కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు అందుబాటులో ఉన్నా జలవనరుల శాఖ ఆ దిశగా దృష్టి సారించలేకపోతోంది.

ఇరిగేషన్‌ శాఖ పరిధిలో విలువైన స్థలాలున్నాయి. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో కాలువలకు ఇరువైపులా పెద్ద ఎత్తున జలవనరుల శాఖకు ఖరీదైన స్థలాలున్నాయి. ఆ స్థలాలను ఉపయో గించుకోవడంలో ఆ శాఖ మొదట్నుంచీ సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లలేక పోతోంది. అసలు పట్టణ ప్రాంతాల్లో ఏ మేరకు స్థలాలున్నాయో కూడా ప్రస్తుతం అధికారులకు అవగాహన లేదు. దీంతో తమను అడిగేవారేలేరన్న ధీమాతో కొంతమంది కబ్జాదారులు పట్టణ ప్రాంతాల్లోని కాలువలకు ఇరువైపులా ఉన్న స్థలాలను గుట్టుచప్పుడు కాకుండా తమ సొంతం చేసుకుని సంవత్సరాల తరబడి అనుభవిస్తున్నారు. మరికొంతమంది అవే స్థలాల్లో నిబంధనలకు విరుద్దంగా వివిధ రకాల నిర్మాణాలను చేపట్టి అద్దెలకు ఇస్తున్నారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో జల వనరుల శాఖకు ఖరీదైన స్థలాలు ఉన్నాయి. ముఖ్యంగా కాలువలు లేని పట్టణ ప్రాంతాలు లేవు. ప్రతి పట్టణంలోను రెండుమూడు కిలోమీటర్ల పొడవునా ఇరిగేషన్‌ కాలువలు ఖచ్చితంగా ఉన్నాయి. వాటికి ఇరువైపులా గతంలోనే కొంత స్థలాన్ని అప్పటి అధికారులు భవిష్యత్‌ అవసరాలను దృష్టి లో ఉంచుకుని ఖాళీగా వదిలిపెట్టారు. ప్రస్తుతం అటువంటి స్థలాలన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఎకరా స్థలం పాతిక నుంచి రూ. 50 కోట్లకు పైగా పలుకుతోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జల వనరుల శాఖకు వేల కోట్ల రూపాయలు విలువైన స్థలాలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో అత్యధిక శాతం ఆక్రమణల్లోనే ఉన్నాయి.

నెల్లూరు శెట్టిగుంటరోడ్డు సమీపంలో విలువైన 2.30 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకుని ఓ నాయకుడు 20 సంవత్సరాలుగా అనుభవి స్తున్నారని.. అదే ప్రాంతానికి చెందిన యార్లగడ్డ శ్రీరామమూర్తి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్ర పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 50 కోట్లు విలువైన స్థలం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు జాఫర్‌సాహెబ్‌ కెనాల్‌ పొడవునా మరికొన్ని స్థలాలు కూడా ఆక్రమణకు గురైనట్లు గుర్తించి విచారణ జరపాలని స్థానిక అధికారులకు మంత్రి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement