అంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి – భవిష్యత్తులో కూడా అమరావతినే రాజధాని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… అందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందుకు తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని తెలిపారు.. గవర్నర్ పసంగానికి ధన్య వాద తీర్మానంపై నేడు అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ, తనకు ప్రత్యర్థి అయినప్పటికీ వైఎస్ రాజశేఖరరె చేసిన మంచి పనులను పొగిడారని, అదీ చంద్రబాబు వ్యక్తిత్వమని కొనియాడారు. రాజకీయాల్లో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో మాబోటి వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఆయన పాలన ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో.. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు కూటమి పక్ష నేతలు, కార్యకర్తలు ఓ హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా తప్పులు చేస్తే అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని అన్నారు. చివరికి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలైనా సరే.. తప్పు చేస్తే వారిని వదులుకోవడానికి కూడా తాను వెనుకాడనని తెగేసి చెప్పారు. ఎవరు తప్పు చేసినా తాము శిక్ష వేస్తామనే సంకేతం ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. చంద్రబాబు అనుభవం ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని.. అందుకు తాము తప్పనిసరిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పంచాయితీ నిధులను బొక్కేశారు
అంతకుముందు శాసన మండలి సభ్యులు అడిగిన 14వ, 15వ ఆర్థిక సంఘం పంచాయతీలకు విడుదల చేసిన దాదాపు రూ.9 వేల కోట్ల గ్రాంట్లను ప్రభుత్వం దారి మళ్ళించిన విషయం వాస్తవమేనా ?? ప్రశ్నకు అవునని సమాధానం చెప్పారు. గత వైసీపీ పాలనపై కూడా నిప్పులు చెరిగారు. పంచాయితీలకు కేంద్రం సకాలంలో నిధులిచ్చినా .. గత ప్రభుత్వం వాటిని బదలాయించలేదని ఆరోపించారు.
పంచాయతీ నిధులను పంచాయతీలకే వాడాలని అన్నారు. కేంద్రం నుంచి నిధులు పంచాయతీలకు వస్తాయన్నారు. రూ. 9098 కోట్ల నిధులు మార్చికి విడుదల కావాల్సి ఉండగా ఇంకా నిధులు విడుదల కాలేదని ఆ నిధులు విడుదలకు సంబంధించి అధికారులతో కూర్చుని చర్చిస్తామని అన్నారు.
రూ. 7518 కోట్లు ఇప్పటిదాకా పంచాయతీ రాజ్ ఇనిస్టిట్యూషన్స్ కి విడుదల చేశారని.. 8 సార్లు ఇప్పటివరకు నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులు పంచాయతీలకి ఎప్పుడూ ఆలస్యంగానే వెళ్లాయన్నారు. కేంద్రం నుంచి సమయానికి నిధులు రాష్ట్రానికి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఐదుసార్లు పంచాయతీకి నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ. 1100 కోట్లు పెనాల్టీ కేంద్రానికి కట్టిందన్నారు. పంచాయతీ సర్పంచుల అనుమతి లేకుండా రూ. 2165 కోట్ల నిధులు డిస్కంలకు గత ప్రభుత్వం కట్టిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖలో జరిగిన అవినీతిపై కమిషన్ వేసే ఆలోచనలో ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖలో ఎంత మేరా అవినీతి జరిగిందో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా రాష్ట్ర పంచాయతీలకు వచ్చి విచారణ చేశారన్నారు.