Tuesday, November 19, 2024

AP – పల్నాడులో శిశువుల విక్రయం కలకలం

ఆకాశరామన్న ఉత్తరంతో వెలుగులోకి బాగోతం

ఆంధ్రప్రభ స్మార్ట్, పల్నాడు బ్యూరో : పల్నాడు జిల్లా నరసరావుపేటలో తొమ్మిది నెలల క్రితం ఓ బాలికను విక్రయించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక నిమ్మతోటకు చెందిన ఓ మహిళకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. మూడో సంతానమైన కుమార్తెకు పోలియో సోకింది. ఆమె నాలుగోసారి గర్భిణిగా ఉన్న సమయంలో ఆ బాలికను పోషించలేక ఆసుపత్రి ఆయా సాయంతో విజయవాడకు చెందిన ఓ ఆటో చోదకుడికి విక్రయించింది. ఇందుకు గాను తల్లికి రూ.లక్ష, ఆయాకు కమీషనుగా రూ.20 వేలు వంతున అతను చెల్లించాడని సమాచారం. ఈ వ్యవహారంపై ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆకాశ రామన్న పేరుతో జిల్లా కలెక్టర్ కు ఉత్తరం రాసి పంపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులను దర్యాప్తునకు ఆదేశించారు. దీని ఆధారంగా మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుభాషిణి రంగంలోకి దిగి శుక్రవారం విచారణ చేపట్టారు.

కొన్నేళ్లుగా శిశువుల విక్రయాలు?
నరసరావుపేట నిమ్మతోట ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళలు కొన్నేళ్లుగా శిశువులను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆమె తెలిపారు. ఇందులో ఓ మహిళ చౌక దుకాణ నిర్వాహకురాలు కావడం గమనార్హం. బాలిక విక్రయంలో వీరి పాత్రపై పోలీసులు మరింతగా కూపీ లాగుతున్నారు. వినుకొండకు చెందిన మహిళ నుంచి కూడా కొన్నేళ్ల క్రితం ఇలాగే కొన్న బాలుడిని ఆసుపత్రి నర్సు ఒకరు పెంచుకుంటున్నట్లు వినికిడి. దీనిపై తాము ఎటువంటి కేసు నమోదు చేయలేదని, ప్రాథమిక సమాచారం మేరకు విచారణ చేస్తున్నామని సీఐ సుభాషిణి వివరించారు.

- Advertisement -

బాపట్ల జిల్లాలో…
ఇటీవలే బాపట్ల జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగు చూసింది. బాపట్లకు చెందిన వెంకటేశ్వరమ్మ మూడు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. తనకు శిశువు కావాలని మూడు వారాల క్రితం నెల్లూరు జిల్లా కావలికి చెందిన నాగమణి ఆమెను సంప్రదించింది. అందుకు లక్ష రూపాయలు ఇస్తానని బేరసారాలు జరిపింది. దీనికి సరేనన్న వెంకటేశ్వరమ్మ తన బిడ్డను నాగమణికి అప్పగించింది. ఇందులో భాగంగా వెంకటేశ్వరమ్మకు నాగమణి రూ.80 వేలు చెల్లించింది. మిగతా రూ.20 వేలు తర్వాత ఇస్తానని చెప్పింది. ఆ తర్వాత ఆమె మిగతా నగదు ఇవ్వమని అడిగితే నాగమణి సమాధానం ఇవ్వలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన వెంకటేశ్వరమ్మ బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కన్నతల్లే శిశువును విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. కావలి నుంచి ఆ మగబిడ్డను రక్షించి పోలీస్ స్టేష‌న్‌కు తరలించారు. అక్కడి నుంచి ఆ శిశువును ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో బాలసదనానికి తరలించారు. ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాపట్ల సీఐ మహమ్మద్ జానీ తెలిపారు. శిశువిక్రయాలు చట్టరీత్యా నేరమని చెప్పారు. ఇటువంటి వాటిపై తమకు సమాచారం అందించాలని సీఐ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement