Thursday, September 19, 2024

AP | యువ‌గ‌ళం యాత్ర‌లో లోకేష్ హామీలు… అమలుకు శ్రీకారం !

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : రాయలసీమలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాయలసీమ పరిధిలో 1,587 కిలోమీటర్లు నడిచిన లోకేష్.. ప్రతి వంద కిలోమీటర్ల యాత్ర పూర్తి చేయడంపై 15 కీలక హామీలు ఇచ్చారు. ఆ హామీల అమలులో భాగంగా ఈ నెల 20న చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఏర్పాటు చేసిన కిడ్నీ డయాలసిస్ కేంద్రానికి రాష్ట్ర మంత్రి హోదాలో లోకేష్ రానున్నారు.

వంద కి.మీకో వాగ్దానం..

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలుగుదేశం పార్టీకి ఊపు తెచ్చే లక్ష్యంతో లోకేష్ యువగాళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 2022 డిసెంబర్ 27న తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పాదయాత్రను ప్రారంభించారు. ఆ సందర్భంగా ప్రతి వంద కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయిన చోట స్థానిక ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రత్యేక హామీ ఇచ్చి, ఆయా హామీల శిలాఫలకాన్ని ప్రారంభించే కార్యక్రమాలు చేపట్టారు.

అందులో పెండింగ్ ప్రోజెక్టుల పూర్తి, కర్నూల్ లో హై కోర్టు బెంచి ఏర్పాటు, తుంగభద్ర హై లెవెల్ లో లెవెల్ ఆధునీకరణ, కుందూ పెన్నా వరద కాలువల పూర్తి, గండికోట నిర్వాసితులకు పూర్తి సహాయం వంటి కీలక హామీలతో పాటు బంగారుపాలెం వద్ద డయాలసిస్ సెంటర్, తిరుపతిలో స్పోర్ట్స్ వర్శిటీ , గంగాధర నెల్లూరు వద్ద డిగ్రీ కళాశాల, మదనపల్లె టమాటో ప్రోసెసింగ్ యూనిట్, కర్నూలులో ఉర్దూ యూనివర్శిటీ, ఆదోనిలో మిర్చియార్డు, కదిరి వద్ద టెంపుల్ టూరిజం సర్క్యూట్, సింగనమల వద్ద చీనీ ప్రోసెసింగ్ యూనిట్, జీడిపల్లి – భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాల తరలింపు మొదలైన 15 ప్రత్యేక హామీలను ఇచ్చారు.

హోదా ఆధారంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఊహించినట్లుగానే రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి లోకేష్ పాదయాత్రలో తాను చేసిన హామీలపై దృష్టి సారించారు. 19న జిల్లాకు రానున్న లోకేష్ 20వ తేదీ ఉదయం డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి తిరుగు ప్రయాణం అవుతారని అధికారులు తెలిపారు. ఆ సందర్భంగా లోకేష్ ఇతర హామీలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement