ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతోనే రాజధాని అమరావతికి జవసత్వాలు వచ్చాయి. రాజధాని అమరావతిని ప్రపంచం గుర్తించేలా తీర్చి దిద్దుతామని, ఈ ఐదేళ్ళలో రాజధాని అమరావతి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే రాజధాని అమరావతిపై వడివడిగా అడుగులు వేస్తున్న చంద్రబు సర్కార్ గత టీడీపీ పాలనలో అసంపూర్ణంగా నిలిచిపోయిన కట్టడాల పరిస్థితిని అధ్యయనం చేసి వాటి నిర్మాణంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్నదానిపై ఐఐటీ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించి వారి సూచనల మేరకు పనులు నిర్వహించాలని భావిస్తుంది.
దీంతో అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటి నిపుణులు నేడు, రేపు అమరావతిలో పర్యటించనుంది. ఐఐటీ మద్రాస్,ఐఐటీ హైదరాబాద్ ల నుంచి ఇద్దరేసి ఇంజినీర్ల బృందాలు రానున్నాయి. రెండు బృందాలు రెండు రోజులపాటు అమరావతిలో పర్యటించి ఆయా కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత,సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి. ఇక ఈ పర్యటన లో భాగంగా సీఆర్డీయే అధికారులతో రెండు బృందాల్లోని ఇంజినీర్లు విడివిడిగా సమావేశం కానున్నారు. రాజధాని నిర్మాణాల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలో వీరు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
నాటి టీడీపీ ప్రభుత్వం సెక్రటేరియట్, హెచ్ వోడి కార్యాలయాల టవర్లతో పాటు హై కోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా పనులు మొదలు పెట్టింది. అయితే 2019 ఎన్నికల్లో అధికారం పోగొట్టుకోవటంతో ఆ నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి. భారీ ఫౌండేషన్ లతో పునాదులు వేసిన చాలా చోట్ల పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు నిలిచిపోయాయి. కొన్ని ఫౌండేషన్లు నీళ్ళలో ఉండిపోయాయి. భవనాల ఫౌండేషన్ సామర్ధ్యాన్ని పరిశీలించే బాధ్యతను ఐఐటీ మద్రాస్ కు అప్పగించింది ఏపీ ప్రభుత్వం.. ఇక ఐఏఎస్ అధికారుల నివాసాలు,మంత్రులు,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది ప్రభుత్వం.
అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఐఐటి ఇంజినీర్లతో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయిస్తున్నది
ఆయా నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్ అంశాలను ఐఐటి ఇంజినీర్లు పరిశీలించనున్నారు.