Saturday, December 14, 2024

AP – జ‌మిలీ బిల్లు వ‌చ్చినా ఎపిలో ఎన్నికలు 2029లోనే … చంద్ర‌బాబు

గుంటూరు – జమిలీ బిల్లు అమల్లోకి వచ్చినా ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని స్పష్టం చేశారు చంద్ర‌బాబు . ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామన్నారు. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని మండిపడ్డారు. 2027 లోనే ఎన్నిక‌లొస్తాయ‌ని వైసిపి చెప్పుకోవ‌డం వారి అవ‌గాహ‌నా రాహిత్య‌మ‌ని అన్నారు.

తెలుగుదేశం పార్టీ కేంద్ర‌ కార్యాల‌యంలో ఆయ‌న నేటి ఉద‌యం ఆయ‌న మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయన్నారు. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతీ చోటా దీనిపై చర్చ జరగాలన్నారు. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని చెప్పారు. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకూ కనిపిస్తున్నాయన్నారు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదన్నారు. భవిష్యత్తుతరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని అన్నారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని స్పష్టం చేశారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామన్నారు. ఈసారి పెట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఎన్నో మార్పులు తీసుకొస్తామని.. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు – సమాధానాల రూపంలో దీనిని నిర్వహిస్తామన్నారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై అజెండా పంపి వాటిపై సమాధానాలు కోరతామని అన్నారు. తద్వారా సమయాన్ని సద్వినియోగం జరగటంతో పాటు మంత్రులు – అధికారుల మధ్య ఇంట్రాక్షన్ పెరుగుతుందన్నారు.

ఇది ఇలా ఉంటే బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వాణీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంపై సీఎం స్పందిస్తూ.. ఆసుపత్రిలో చేరిన అయ‌న‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. అద్వానితో తనకు దశాబ్దాల కాలం నుంచి అనుబంధం ఉందన్నారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అద్వాణీ సహకారం మరువలేనిది అని అన్నారు.

- Advertisement -

వినతుల స్వీకరణ..

కాగా..పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సాగునీటి సంఘాలు, సహకార ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. చంద్రబాబు భేటీలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, దేవినేని ఉమా, చినరాజప్ప, అశోక్ బాబు తదితరులు ఉన్నారు.

డోకిప‌ర్రు వెళ్ల‌నున్న చంద్ర‌బాబు

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామాన్ని నేడు సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. గ్రామంలోని శ్రీభూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో నవమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అధినేత, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం 3.45 గంటలకు ఉండపల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో సీఎం చంద్రబాబు బయలుదేరి 4.00 గంటలకు డోకిపర్రు గ్రామానికి చేరుకుంటారు. హెలిపాడ్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీభూ సమేత వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు.

ఆలయ బ్రహ్మోత్సవాల ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హెలికాఫ్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు విజయవాడ (గన్నవరం) ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌కు చేరుకుంటారు. 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ అక్కడ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 8.30గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

కాగా, సీఎం హెలికాఫ్టర్‌లో డోకిపర్రు రానున్న దృష్ట్యా స్థానిక మేఘా సంస్థ ఫార్మ్ హౌస్ ఎదుట పొలాల్లో హెలిపాడ్ నిర్మాణానికి ఎస్పీ, కలెక్టర్ నిన్న పరిశీలించి అనుమతి ఇచ్చారు. దీంతో మేఘా సంస్థ ప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన హెలిపాడ్ నిర్మాణ పనులు చేపట్టారు. చంద్రబాబు పూజలు చేసే ప్రాంతాన్ని ఎస్పీ, కలెక్టర్ పరిశీలించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆలయ ప్రతినిధులకు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement